తిరిగి తిరిగి వెంకీ చేతికి చిక్కిన ఆ రీమేక్‌!

By Inkmantra - October 25, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్‌ అంటే రీమేక్‌ల స్పెషలిస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్‌లో దాదాపు సగానికి పైగా రీమేక్‌లే ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా వెంకీ చేతికి మరో రీమేక్‌ వచ్చింది. తమిళంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కి, మంచి విజయం సాధించిన 'అసురన్‌' రీమేక్‌లో వెంకటేష్‌ నటించబోతున్నాడు. నిజానికి ఈ రీమేక్‌లో నాగార్జున నటించనున్నాడనీ ప్రచారం జరిగింది. నిజంగానే నాగ్‌ చాలా గట్టిగా ట్రై చేశాడు కూడా.

 

రీసెంట్‌గా ఈ రీమేక్‌ హక్కుల్ని చరణ్‌ దక్కించుకున్నాడంటూ గాసిప్‌ కూడా వచ్చింది. అయితే, ఎట్టకేలకు అది వెంకీ చేతికి చిక్కింది. కలైఫులి థాను, సురేష్‌ బాబు సంయుక్తంగా ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ తమిళ రీమేక్‌లో నటించబోయే హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అలాగే డైరెక్టర్‌ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. వెంకీ గతంలో నటించిన 'గోపాల గోపాల', 'గురు', 'దృశ్యం'.. తదితర చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి.

 

అలాగే 'అసురన్‌' కూడా వెంకీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌ 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిశంబర్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య ఈ సినిమాలో వెంకీకి మేనల్లుడిగా నటిస్తున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS