తొలి ప్రేమతో తొలి అడుగులోనే దర్శకుడిగా నిరూపించుకున్నాడు వెంకీ అట్లూరి. ఆ తరవాత తీసిన మిస్టర్ మజ్ను ఫెయిల్ అయినా.. `రంగ్ దే`తో మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు. వెంకీ అట్లూరి అంటే యూత్ ఫుల్ కథలే అనుకుంటాం. కానీ తాను ఇప్పుడు ఓ మాస్ కథని తయారు చేసుకున్నాడట. ఓ పెద్ద హీరోతో యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి ప్రయత్నాలుమొదలెట్టాడని టాక్. అందులో భాగంగా బాలయ్య అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. తన కథ బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని వెంకీ అట్లూరి భావిస్తున్నాడట.
త్వరలోనే బాలయ్యని కలసి ఈ కథ వినిపించాలని తహతహలాడుతున్నాడు. కొత్త దర్శకుల భుజం తట్టడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. వెంకీ అట్లూరి కథ ఓకే చేస్తే.. నిజంగా అదో విచిత్రమైన కాంబినేషన్ అయిపోతుంది. అయితే వెంకీ కథ నచ్చినా, ఇప్పటికిప్పుడు డేట్లు ఇవ్వడానికి బాలయ్యకు వీలు కాదు. ఎందుకంటే `అఖండ` తరవాత... గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిలు రెడీగా ఉన్నారు. ఆ తరవాతే... వెంకీ కి ఛాన్స్ వస్తుంది.