తెరపై నవ్వులు పూయించిన వేణు మాధవ్ మరణించారు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా హైద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. చిన్నతనం నుండీ మిమిక్రీపై ఆసక్తి పెంచుకున్న వేణు మాధవ్ బుల్లితెరపై యాంకర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వెండి తెరపై నవ్వుల పువ్వులు పూయించారు. 600కు పైగా సినిమాల్లో నటించిన వేణుమాధవ్ ఈ మధ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.
'సంప్రదాయం' సినిమాతో తెరంగేట్రం చేసిన వేణుమాధవ్ చాలా చిత్రాల్లో హాస్య నటుడిగా నటించారు. 'హంగామా', భూ కైలాస్' చిత్రాలతో హీరోగానూ పేరు తెచ్చుకున్నారు. 'తొలిప్రేమ' సినిమా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 'లక్ష్మీ' సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
ఒకానొక టైంలో వేణు మాధవ్ లేని సినిమానే లేదు అంటే అతిశయోక్తి కాదనేలా ఆయన తన మార్క్ కామెడీతో మెప్పించారు. సినిమాలతో పాటు, రాజకీయాల్లోనూ వేణు మాధవ్ చురుగ్గా పాల్గొన్నారు. కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పని చేశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వేణు మాధవ్ మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.