అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన 'అఖిల్' సినిమాకి సంబంధించి నిర్మాత నితిన్ కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. సినిమా హక్కుల కోసం 50 లక్షల రూపాయిలు చెల్లించాననీ, అయితే సినిమా హక్కులు ఇవ్వలేదనీ, తనను దారుణంగా మోసం చేశారనీ, ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సినిమా నిర్మాత అయిన హీరో నితిన్, ఆయన సోదరి నిఖితా రెడ్డి, తండ్రి సుధాకర్ రెడ్డి, నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్‌పై సదరు వ్యక్తి ఆరోపణలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.
అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా 'అఖిల్'. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, నిర్మాతలకు నిరాశ మిగిల్చింది. కొన్ని కొన్ని సినిమాల విషయంలో వివాదాలు ఇలాగే ఉంటాయి. ఈ రకంగానే సద్దుమణిగిపోతూ ఉంటాయి కూడా. కొందరు అనవసరంగా సినిమానీ, చిత్ర యూనిట్‌నీ డీగ్రేడ్ చేయడానికి ఇలాంటి కేసులు పెడుతూ ఉంటారు. వాటిలో కొన్ని సీరియస్ కేసులు కూడా ఉంటాయి.
ఏదేమైనా 'అఖిల్' సినిమా విషయంలో నిర్మాతగా హీరో నితిన్‌కు ఆర్ధికంగా చాలా నష్టం మిగిల్చింది. దానికి తోడు ఈ వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఈ వివాదం నుండి నితిన్ బయట పడ్డాడు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కింది 'అఖిల్'. సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటించింది. మరో పక్క అఖిల్ ఇటీవలే 'హలో' సినిమాతో హీరోగా రీ లాంఛ్ అయ్యాడు. సక్సెస్ అందుకున్నాడు.