బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఎప్పటి నుండో తెలుగులో సినిమా చేయాలనుకుంటోంది. అయితే తెలుగులో సినిమా అంటూ చేస్తే అది నాగార్జునతోనే అని గతంలో విద్యాబాలన్ చెప్పింది. కానీ అది కుదరలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా బాలయ్యతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో చాలా ఆనందంగా ఉందని విద్యాబాలన్ చెప్పింది. ఇక సినిమా విషయానికి వస్తే, తాజాగా విడుదలైన ట్రైలర్‌లో అంతా ఆమె పాత్రే కనబడింది. అంటే ఈ సినిమాకి విద్యాబాలన్ పాత్ర ఎంత కీలకమో అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి 'బసవతారకం' అంటే స్వర్గీయ ఎన్టీఆర్ మొదటి భార్య అని మాత్రమే చాలా మందికి తెలుసు. ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటనేదిఈ తరం వారికి అస్సలు తెలియదు. అలాంటిది ఈ బయోపిక్‌లో బసవతారకం పాత్రను చాలా కీలకంగా చూపించారు. 'బావ' అంటూ బాలయ్యను పిలవడం, భార్యా భర్తలుగా బాలయ్య, విద్యాబాలన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. విద్యాబాలన్ చాలా మంచి నటి.
ఆ సంగతి అందరికీ తెలిసిందే. అయితే బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌లోని నటి మరోసారి కొత్తదనంతో పురుడు పోసుకుంది. ఈ పాత్ర కోసం విద్యాబాలన్‌నే ఎందుకు ఏరి కోరి ఎంచుకున్నారో ట్రైలర్ చూశాక అర్ధమవుతుంది. ఇక ట్రైలర్‌లోనే ఆమె పాత్ర ఔచిత్యాన్ని ఇంత బాగా కట్ చేశారంటే, సినిమాలో ఇంకెంత బాగా చూపించి ఉంటారో. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ సంక్రాంతికి విడుదల కానుంది.