తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి విజయ్ - అజిత్ అభిమానుల మధ్య ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే వుంటాయి. అత్యంత జుగుప్సాకరంగా వుంటాయి ఈ గొడవలు. అజిత్ మృతికి సంతాపం.. అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తుంటారు విజయ్ అభిమానులు. విజయ్ విషయంలో అజిత్ అభిమానులదీ ఇదే తీరు. కానీ, అటు అజిత్.. ఇటు విజయ్.. ఇద్దరూ ఎప్పుడూ ఒకర్ని ఒకరు దూషించుకున్న సందర్భాల్లేవు.
అసలు, ఏ విషయంలోనూ ఇద్దరి మధ్యా ఇంతవరకు విభేదాల్లేవు. కానీ, అభిమానుల మధ్య పెరిగిపోతున్న దూరం నేపథ్యంలో ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చి, ఓ మల్టీస్టారర్ సినిమా చేయడం ద్వారా అభిమానుల మధ్య గొడవ చల్లార్చాలనే ప్రయత్నం చేస్తున్నారట. నిజానికి, ఏడాది క్రితమే ఈ ఆలోచనలు ఇద్దరిలోనూ కలిగాయనీ, ఓ ప్రముఖ నిర్మాత లీడ్ తీసుకుని, ఇరువురితోనూ చర్చించాడనీ అంటున్నారు. అజిత్, విజయ్ కాంబినేషన్లో సినిమా బాధ్యతని ఓ ప్రముఖ దర్శకుడికి సదరు నిర్మాత అప్పగించారట.
దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా వుండబోతోందనీ, కమర్షియల్ ఫార్ములాతో వుండే ఎంటర్టైనర్ అనీ అంటున్నారు. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేయబోతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. టాలీవుడ్లో టాప్ ప్లేస్ వైపుకు దూసుకపోతున్న ఇద్దరు భామలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించే అవకాశం వుందంటున్నారు.