తమిళ హీరో విజయ్ నటించిన సినిమాలకు తెలుగులో క్రేజ్ చాలా చాలా తక్కువ. అదే సమయంలో, విజయ్ నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి రీమేక్ అయి విజయం సాధిస్తుంటాయి. డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతమవవు. కానీ, ఈసారి ‘మాస్టర్’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా హిట్టు కొట్టాలనే కసితో వున్నాడట విజయ్.
పాన్ ఇండియా ఆలోచనల దిశగా చాలామంది హీరోలు అడుగులేస్తున్న దరిమిలా, విజయ్ కూడా ఆ దిశగా తన ఆలోచనలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్‌కి ప్రమోషన్స్ చేసినట్లుగానే, తెలుగు వెర్షన్‌కి కూడా చేయాలని ఇప్పటికే నిర్మాతలకు సూచించాడట విజయ్. కాగా, విజయ్ అభిమానులు తమిళనాడులోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పుడే సందడి షురూ చేశారు. గతంలో కార్తీ, సూర్య తదితరులకు తెలుగు నాట భారీగా ప్రచారం కల్పించారు ఇక్కడి అభిమానులు.
పట్టణాల్లోనే కాకుండా, పల్లెటూళ్ళలోనూ అభిమాన సంఘాలంటూ కొందరు హంగామా చేసిన సంగతి తెలిసిందే. అలాంటి హంగామా చేయాలని విజయ్ అభిమానులూ ప్రయత్నిస్తున్నారుగానీ, పరిస్థితులు అనుకూలించడంలేదట. ఇదిలా వుంటే, తమిళనాట పెరిగిన రాజకీయ వేడి నేపథ్యంలో ‘మాస్టర్’ సినిమాపై పొలిటికల్ కన్ను కూడా పడింది. సినిమాలో కొన్ని రాజకీయ అంశాల్ని కూడా టచ్ చేశారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.