ఒక్క సినిమా 'రౌడీ' ఆటిట్యూడ్‌ని మార్చేసింది. 'నా ఆటిట్యూడ్ ఎప్పటికీ మారదు' అని ఇదివరకే విజయ్ దేవరకొండ ప్రకటించినా, ఆ ఆటిట్యూడ్‌ని మార్చుకోక తప్పదన్న వాస్తవం ఇప్పుడిప్పుడే ఆయన గుర్తిస్తున్నాడు.
యంగ్ హీరో నిఖిల్ చెప్పినట్లు, సినీ పరిశ్రమ అంటే ఓ సముద్రం లాంటిది. అందులో ఎంత పెద్ద స్టార్ అయినా నీటి బొట్టుతోనే సమానం అనుకోవాలేమో. ఇప్పుడున్న పరిస్థితులే అందుకు నిదర్శనం. ఎవరికి ఎప్పుడు ఎలా స్టార్‌డమ్ వస్తుందో ఊహించలేం. రాత్రికి రాత్రి స్టార్‌డమ్ లెక్కలు మారిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంకొకర్ని కలుపుకుపోవడం చాలా అవసరం.
'భరత్ అనే నేను' సినిమా టైమ్‌లో మహేష్, ఎన్టీఆర్ - చరణ్‌లను కలుపుకుపోయాడు. తద్వారా 'భరత్ అనే నేను' సినిమా పట్ల నెగెటివిటీ ఆయా హీరోల అభిమానుల్లో తగ్గిపోయింది. ఇది తెలుగు సినిమాకి ఎంతో మేలు చేస్తుంది అంతిమంగా. ఓ హీరో సినిమాని ఇంకో హీరో మెచ్చుకోవడం ద్వారా సినీ పరిశ్రమ అంతా ఒక్కటిగా వుందన్న సంకేతాల్ని పంపడానికి వీలవుతుంది. విజయ్ దేవరకొండకి ఎవరితోనూ విభేదాల్లేవు. కానీ, 'రౌడీస్' కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. దానికి విజయ్ ఆటిట్యూడ్ కొంత ఆజ్యం పోసిందన్న విమర్శలు 'నోటా' రిజల్ట్ తర్వాత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తనకు ఆయా హీరోలతో వున్న సన్నిహిత సంబంధాల్ని ఇంకా బలోపేతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నాడట.
ఇది మంచి ఆలోచనే. అభిమానుల్నీ ఆ దిశగా విజయ్ టర్న్ చేయాల్సి ఉంటుంది. అభిమానులకి ఆవేశం తప్ప, ఆలోచన ఉండదని 'రౌడీస్' ఇంకోసారి నిరూపించారు. ఆ అనాలోచిత ఆవేశం, హీరోలను ఇరకాటంలో పడేయడం చాలాసార్లు చూశాం. విజయ్ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదని తేలిపోయింది.