విజయ్ దేవరకొండ.. ఇప్పుడీ పేరు తెలియని వాళ్లే లేరు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఈ పేరు పరిచయమైపోయింది. అందరికీ మనోడు దగ్గరైపోయాడు. యూత్ ఐకాన్ మనోడు.
ఇకపోతే ఈయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఇప్పుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. మధురా శ్రీధర్ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రంతో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో రాజశేఖర్ చిన్న కుమార్తై శివాత్మిక కూడా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతుండడం విశేషం. రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఒకేసారి తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ నటిస్తున్న చిత్రం ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. అడవిశేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ విషయానికి వస్తే పోలికల్లో అచ్చు అన్న విజయ్ దేవరకొండనే తలపిస్తున్నాడు.
ఇక ఆటిట్యూడ్‌ని కూడా మ్యాచ్ చేయగలిగితే అన్నకి తగ్గ తమ్ముడిలా టాలీవుడ్‌ని దున్నేసుకోవచ్చు. అయితే అందరికీ ఆటిట్యూడ్ కలిసి రాదు. అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టైం నడుస్తోంది. అతను ఏది పట్టినా బంగారమే అవుతోంది. మరి ఈ తరుణంలో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఆనంద్ దేవరకొండకు పనికొస్తుందా? లేక డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో స్వతహాగా హీరోగా తానేంటో నిరూపించుకుంటాడో ఆ సినిమా విడుదలైతే కానీ తెలీదు.