తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రచార పర్వానికి తెరలేస్తోంది. ఎన్నికలంటే సినిమా గ్లామర్ తప్పనిసరి. రాజకీయ వేదికలపై తారలు మెరిస్తే.... అదో ఆకర్షణ. ఈసారి తెలంగాణ ఎన్నికల్లోనూ స్టార్ల హవా కనిపించబోతోంది. టీఆర్ఎస్ తరపున కొంతమంది సినిమా స్టార్లు ప్రచార పర్వంలో పాల్గొంటారని తెలుస్తోంది. అందులో విజయ్ దేవరకొండ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
యూత్‌లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. విజయ్‌కీ.. కేటీఆర్కీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ తరచూ కలుస్తుంటారు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ స్నేహాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలని టీఆర్ ఎస్ శ్రేణులు భావిస్తున్నట్టు టాక్.
రాబోయే ఎన్నికలలో టీఆర్.ఎస్ పార్టీ తరపున విజయ్ ప్రచారంలో పాల్గొంటాడని సమాచారం అందుతోంది. ఈమధ్య `నోటా` అంటూ ఓ రాజకీయ చిత్రం కూడా చేశాడు విజయ్. ఆ అనుభవం కూడా ప్రచారానికి ఉపయోగపడే అవకాశాలున్నాయి.