విజయ్ దేవరకొండ నిన్న ఓ వీడియో విడుదల చేశాడు.. తన ‘ది దేవరకొండ ఫౌండేషన్’కి సంబంధించి. దాంట్లో, ఓ ప్రముఖ వెబ్‌సైట్‌పైనా విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ దేవరకొండకు బాసటగా సూపర్ స్టార్ మహేష్‌బాబు మరికొందరు సినీ ప్రముఖులు నిలబడ్డారు. నిజానికి, ఇది చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే. అయితే, ఇప్పుడు విజయ్ దేవరకొండకు మద్దతుగా మొత్తం సినీ పరిశ్రమ కదిలి వస్తోంది. ఇంతకు ముందు ఇలాంటి సందర్భమే రాలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే స్పందించారు.
ఆ మాటకొస్తే, మహేష్‌బాబు కూడా దాదాపు పదేళ్ళ క్రితమే, వెబ్‌సైట్లలో వచ్చే జుగుప్సాకరమైన కథనాలపై అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రకాల గాసిప్స్‌ని సినీ ప్రముఖులు ఎంజాయ్ చేస్తుంటారు. సద్విమర్శల్ని స్వీకరించడానికీ సినీ జనాలు సిద్ధమే. కానీ, ‘జుగుప్స’ అనేదే ఇక్కడ అభ్యంతకరం.. అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘ఈ విషయం ఇక్కడితో ఆగిపోదు.. ఇంకా ముందుకు వెళుతుంది..’ అని ఓ సినీ ప్రముఖుడు అభిప్రాయపడ్తున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి కూడా, ఈ తరహా వేధింపులకు బాధితుడేనని మెగా అభిమానులు చెబుతున్నారు. ఏమో, ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో వేచి చూడాల్సిందే.