లైగర్ తో భారీ డిజాస్టర్‌ని మూటగట్టుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు తన ధ్యాసంతా `ఖుషీ`పైనే ఉంది. కానీ సమంత గైర్హాజరుతో ఈ షూటింగ్ ఆగిపోయింది. ఈలోగా మరో సినిమాని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. దిల్ రాజు సంస్థలో ఓ సినిమా చేయడానికి విజయ్ ఎప్పుడో అడ్వాన్స్ తీసుకొన్నాడు. అందుకే ఈ గ్యాప్ లో దిల్ రాజు సినిమా మొదలెట్టాలన్నది విజయ్ ఆలోచన. అందుకే దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండకు సరిపడా కథల్ని అన్వేషిస్తున్నాడు.
ఇటీవల... ఇంద్రగంటి మోహన కృష్ణ దిల్ రాజుకి ఓ కథ వినిపించాడట. అది విజయ్ కి బాగా సూటవుతుందని దిల్ రాజు భావిస్తున్నాడు. ఇంద్ర గంటిది జెట్ స్పీడు వ్యవహారం. ఆయన సినిమాల్ని చక చక లాగించేస్తుంటారు. కాబట్టి.. విజయ్ తో సినిమాని అనుకొన్న బడ్జెట్ లో, అనుకొన్న సమయానికి పూర్తి చేయొచ్చన్నది ప్లాన్. కాకపోతే ఇంద్రగంటి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. తను తీసిన `వీ` డిజాస్టర్ అయ్యింది. ` ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` కూడా అంతే. వరుసగా రెండు ఫ్లాపులిచ్చిన దర్శకుడితో విజయ్ సినిమా చేయడం అంటే అనుమానమే. ఎందుకంటే.. లైగర్ ఫ్లాప్ తరవాత విజయ్ కథల విషయంలో జాగ్రత్త పడాల్సివస్తోంది. ఇలాంటి తరుణంలో తప్పు చేస్తే.. తన కెరీర్ పెద్ద ప్రమాదంలో పడుతుంది. అందుకే.. దిల్ రాజు ప్రపోజల్‌కి ఓకే చెబుతాడా, లేదా అనేది అనుమానంగా మారింది.