విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'నోటా'. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రచార చిత్రాలతోనే రికార్డులు కొల్లగొట్టేశాడీ యంగ్ స్టర్. ఇక సినిమా సినిమాకీ విజయ్ దేవరకొండ తన మార్కెట్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. 'పెళ్లిచూపులు'తో మొదలైన సెన్సేషన్ 'అర్జున్‌రెడ్డి'తోనే పీక్స్‌కి వెళ్లిపోయిందనుకుంటే, ఇక 'గీత గోవిందం' స్టార్ హీరోల వరుసలో నిలబెట్టేసింది.
ఇప్పుడు రాబోతున్న 'నోటా'పై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. 'గీత గోవిందం' సినిమాతో 60 కోట్ల వసూళ్లు కొల్లగొట్టేసిన విజయ్ దేవరకొండ 'నోటా'తో 100 కోట్ల మార్కెట్ దిశగా పరుగులు పెట్టించేలా ఉన్నాడు. ప్రతీ రాజకీయ నాయకుడూ ఖచ్చితంగా చూడవల్సిన చిత్రంగా 'నోటా' గురించి విజయ్ చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాని తెలుగతో పాటు, తమిళ, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేస్తుండడంపై విజయ్ దేవరకొండపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్ధమవుతోంది.
ఇంతవరకూ చేసిన పాత్రలు ఓ ఎత్తు. 'నోటా'లో తన క్యారెక్టర్ ఒక ఎత్తు అంటూ చెబుతున్న విజయ్ మాటలను బట్టి చూస్తుంటే 'నోటా'తో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో రూపొందుతోన్న 'నోటా'అక్టోబక్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.