టెన్షన్ కొనసాగుతూనే వుంది 'నోటా' సినిమా రిలీజ్ విషయంలో. ఓ వైపు భారీ అంచనాలు.. ఇంకో వైపు, సినిమా విడుదలపై సస్పెన్స్ వెరసి.. 'రౌడీస్'కి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెలంగాణలోనే ఈ సినిమా రిలీజ్‌పై అభ్యంతరాలున్నాయి. కొందరు, 'నోటా' రిలీజ్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో, సినిమా విడుదలపై న్యాయస్థానమే క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి.
కాస్సేపట్లోనే ఈ అంశంపై స్పష్టత రాబోతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 'నోటా' సినిమా ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు 'నోటా' అంటే 'నన్ ఆఫ్ ది ఎబౌ' కావడమూ వివాదాలకు తావిస్తోంది. 'ఎవరికీ ఓటెయ్యొద్దు' అనే సంకేతం సినిమా టైటిల్ ద్వారా వచ్చిందన్నది కొందరి ఆరోపణ. అయితే సినిమాని సినిమాగా చూడాలి తప్ప, సినిమాకి రాజకీయాలతో ముడిపెట్టవద్దంటూ ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ విజ్ఞప్తి చేశాడు.
కానీ, విజయ్ దేవరకొండ తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో సినిమా ఖచ్చితంగా టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా వుండి తీరుతుందని టీఆర్‌ఎస్ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణలో సినిమా విడుదల ఆలస్యమయ్యేలా న్యాయస్థానం తీర్పునిస్తే, ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకు ఆటంకాలు వుండకపోవచ్చు. కానీ, అలా చేయడానికి నిర్మాత ముందుకు రాకపోవచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రోజు అమెరికాలో ప్రీమియర్స్ పడిపోతున్నాయి. ఈ రోజు సాయంత్రం నుంచే స్పెషల్ షోలు వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి, ఇంత హడావిడిలో 'నోటా'కి న్యాయస్థానం నుంచి ఎలాంటి సిగ్నల్ వస్తుందో వేచి చూడాల్సిందే.