సింగిల్ సాంగ్ సింగిల్ నైట్ ఓవర్ సెన్సేషన్. అదీ మనోడి సెన్సేషన్. అయితే ఈ సారి సెన్సేషన్ మరోలా అయ్యింది. ఇదంతా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' చిత్రం ఆడియో వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఇదంతా మామూలే. అయితే ఈ ఆడియో ఫంక్షన్‌కి ముందు 'గీత గోవిందం' సినిమాలోని ఓ ఆడియో సింగిల్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటను స్వయంగా విజయ్ దేవరకొండ ఆలపించాడు. యూట్యూబ్‌లో వదిలిన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ మీద రకరకాల స్పూఫులు, వెటకారాలతో సోషల్ మీడియాలో మనోడ్ని ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు. ఈ పాటలోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, విజయ్ దేవరకొండపై విపరీతంగా ట్రోలింగ్ మొదలెట్టేశారు.
వెంటనే ఈ పాటను తొలగించాలని పలువురు అభ్యతరం వ్యక్తం చేశారు. దాంతో ఈ పాట రాసిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీమణి, హీరో విజయ్ దేవరకొండ వెంటనే సారీ చెప్పి, యూట్యూబ్ నుండి ఆ పాటను తొలగించారు. ఈ పాట విషయమై విజయ్ దేవరకొండ ఆడియో వేదికపై స్పందించాడు.
మరోసారి అభిమానులకు సోరీ చెబుతూ, వారందరికీ కౌంటర్ ఇచ్చాడు. ఇంతలా నన్ను ఆడేసుకుంటారని అనుకోలేదు. ఆ పాటలోని పదాలను మార్చి, ఎవరైనా పాడి మాకు పంపించండి. వాయిస్ నచ్చితే వారితోనే పాడించి, మా సినిమాలో పెడతాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. అయితే ఈ ఆఫర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమయ్యిందనుకుంటా. మరోసారి ట్రోలింగ్ మొదలెట్టేశారు.