సినిమా కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్‌లో 'అజ్ఞాతవాసి' లాంటి ఫ్లాప్ వస్తుందని ఎవరైనా ఊహించారా.? మెగాస్టార్ చిరంజీవి కావొచ్చు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు కావొచ్చు.. మరొకరు కావొచ్చు, తమ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. సక్సెస్ వస్తే పొంగిపోవడం, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవడం గెలవాలనుకునేవాడి లక్షణమే కాదు.
ఇప్పుడివన్నీ ఎందుకంటే, 'నోటా' సినిమా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, 'ఓపెన్ లెటర్' లాంటిదొకదాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు ఈ యంగ్ హీరో. 'నోటా' ఫెయిల్యూర్‌తో కొందరు పండగ చేసుకుంటున్నారంటూ, వెటకారాలు చేశాడు అందులో. ఇది ఆయన 'రౌడీస్'కి నచ్చవచ్చుగాక. కానీ, సక్సెస్ కొట్టాక ఇదే ఓపెన్ లెటర్ విజయ్ దేవరకొండ రాసి వుంటే అది ఇంకోలా వుండేది.
'నా ఆటిట్యూడ్ ఇంతే' అని విజయ్ దేవరకొండ చెప్పుకోవడం సమర్థనీయం కానే కాదు. ఎందుకంటే, సినిమా ఏ ఒక్కడిదో కాదు. ఓ యూనిట్ మొత్తం ఓ సినిమా కోసం పనిచేస్తుంది. అందులో ఓ తప్పిదం సినిమాని ముంచేయొచ్చు. చాలామంది కష్టపడితే ఓ సక్సెస్ వస్తుంది. అది విజయ్ దేవరకొండకీ తెలుసు. ఏదిఏమైనా, తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న విజయ్‌ని 'నోటా' ఫెయిల్యూర్ చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం.
దాన్నుంచి తేరుకుని, మరో హిట్ కొట్టగల సత్తా వున్నోడే విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్, తన ఆటిట్యూడ్‌కి భిన్నంగా 'కుంగుబాటు'ని చాటుకున్నాడేంటి? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. విజయ్‌ని ఫైటర్‌గా భావించి, 'రౌడీస్' (విజయ్ అభిమానులు) అతన్ని అభిమానిస్తున్నారు, అతని ఆటిట్యూడ్‌కీ ఫిదా అయిపోతున్నారు. నాయకుడిలా, తొందరపడితే ఎలా?