యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నయా సూపర్ స్టార్‌గా అవతరించేందుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. 'నోటా' సినిమా రిజల్ట్ అతన్ని పూర్తిగా నిరాశపర్చింది. ఆ సినిమా హిట్ అయి వుంటే, విజయ్ దేవరకొండ ఇమేజ్ ఇప్పుడు ఇంకోలా వుండేదేమో.! సినిమా అంటేనే అంత. ఎప్పుడు ఎవరి ఇమేజ్ ఎలా పెరుగుతుందో, ఎలా తగ్గుతుందో అంచనా వేయలేం.
'నోటా' పరాజయాన్ని జీర్ణించుకోవడానికి చాలా టైమ్ పట్టింది విజయ్ దేవరకొండకి. కాస్త తేరుకుని, 'ట్యాక్సీవాలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే, 'ట్యాక్సీవాలా' సినిమాకి ఆశించిన స్థాయిలో హైప్ రావడంలేదు. సినిమా రిలీజ్‌కి దగ్గర పడ్తున్నా, హైప్ రాకపోవడంతో 'ట్యాక్సీవాలా' టీమ్ చెయ్యాల్సిన ప్రయత్నాలకంటే ఎక్కువే చేయాల్సి వస్తోంది.
రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' ముందు 'ట్యాక్సీవాలా' సినిమా అస్సలేమాత్రం కన్పించడంలేదు ప్రస్తుతానికి. శ్రీనువైట్ల - రవితేజ కాంబోలో సినిమా కావడం, ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్ కావడంతో 'అమర్ అక్బర్ ఆంటోనీ'పై హైప్‌కి కారణం. 'ట్యాక్సీవాలా' సినిమా విషయానికొస్తే, విజయ్ దేవరకొండ తప్ప ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమీ కన్పించడంలేదు. హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ కూడా పెద్దగా ఎవరికీ తెలియకపోవడం మైనస్ పాయింట్. 'రౌడీస్' కూడా ఎందుకో సోషల్ మీడియాలో డల్‌గా వున్నారు. 'గీత గోవిందం' తర్వాత 'నోటా' ముందు వున్న జోరు, ఇప్పుడు రౌడీస్‌లో కన్పించడంలేదు.
మరి, 'ట్యాక్సీవాలా' ఏం చేస్తుంది.? విజయ్‌ని నిలబెడ్తుందా.? వేచి చూడాల్సిందే.