తమిళ నాట విశాల్ సినిమాలన్నీపైరసీ కోరల్లో చిక్కుకుంటున్నాయి. విశాల్ సినిమా విడుదల రోజేనే.. హెచ్ డీ క్వాలిటీతో తన సినిమాని అప్‌లోడ్ చేసేస్తున్నారు. దీని వెనుక పెద్ద కథే ఉంది. పైరసీపై విశాల్ చాలా రోజుల క్రితం పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. సీడీ షాపుల్లోకి వెళ్లి... అక్కడ కనిపించిన పైరసీ సీడీల్ని బయటకు తీసుకొచ్చి తగలబెట్టాడు. అంతేకాదు.. ఆ షాపు నిర్వాహకులపై కేసులు కూడా వేశాడు.
అప్పటి నుంచి పైరసీ దారులకూ.. విశాల్‌కీ మధ్య పోరాటం మొదలైంది. `నీ సినిమా లీక్ చేస్తాం.. పైరసీ చేస్తాం` అంటూ ముందే చెప్పి.. చెప్పింది చేసి చూపించారు. చివరికి విశాల్ కాస్త నెమ్మదించాడు. `నేనేం చేసినా పైరసీ ఆగదు` అనుకుని కామ్ అయిపోయాడు. సేమ్ టూ సేమ్ ఇలాంటి పరిస్థితే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకీ ఎదురవుతుందా? అనే అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఎందుకంటే... విజయ్ దేవరకొండ సినిమాలన్నీ వరుసగా లీక్ అవుతున్నాయి. గీతా గోవిందంలోకి కీలక సన్నివేశాలు ముందే బయటకు వచ్చేశాయి. టాక్సీవాలా అయితే సినిమా మొత్తం లీక్ అయిపోయింది. దాంతో విజయ్ రెచ్చిపోయి... పైరసీ సైట్లని ఉద్దేశించి `మిడిల్ ఫింగర్` చూపించాడు. ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో వాళ్ల గురించి చాలా చాలా మాట్లాడాడు. ఇదంతా పైరసీ గ్యాంగ్ సీరియెస్ గా తీసుకునే అవకాశం ఉందని, విశాల్ విషయంలో జరిగినట్టే... విజయ్ విషయంలోనూ పైరసీ పైరసీ గ్యాంగ్ పగబట్టే ప్రమాదం ఉందని టాలీవుడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
తన సినిమా లీకైన.. హిట్టవ్వడం ఖాయమన్నది విజయ్ ధీమా. అయితే ఇది అన్ని వేళలా పనిచేయదు. పైరసీ సినిమా బయటకు రావడం వల్ల... ఆ ప్రభావం వసూళ్లపై పడుతుంటుంది. నిర్మాతలకూ పంపిణీదారులకు ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. విజయ్ రాబోవు సినిమాలు కూడా ఇలానే పైరసీ బారీన పడితే.. విజయ్‌ని ఎవరో కావాలని టార్గెట్ చేస్తున్నట్టే భావించాలి.