తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. వాళ్ల డబ్బింగ్ సినిమాలకు మంచి రేట్లు గిట్టుబాటు అవుతుంటాయి.
అయతే విజయ్ మాత్రం తెలుగు మార్కెట్‌పై పెద్దగా దృష్టి సారించలేకపోయాడు. తన సినిమాలు ఇక్కడ విడుదల అవుతున్నా.. సరైన ఫలితాలు కూడా వచ్చేవి కావు. అయితే ఈమధ్య విజయ్‌కీ మార్కెట్ ఏర్పడడం మొదలైంది. `తుపాకీ`కి తెలుగులో మంచి వసూళ్లు వచ్చాయి. `అదిరింది` కూడా ఓకే అనిపించుకుంది.
దీపావళికి విడుదలైన `సర్కార్`కి తెలుగులో మంచి వసూళ్లే వచ్చాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ దాదాపుగా రూ.7 కోట్లకు కొన్నారు. విజయ్ సినిమాకి ఏడు కోట్లెందుకు అని నొసలు చిట్లించారంతా. కానీ ఈ సినిమాకి అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. తొలివారంలో రూ.7.9 కోట్లు సాధించి... పంపిణీదారుల్ని గట్టెక్కించేసింది.
తెలుగుకి సంబంధించి విజయ్ కెరీర్‌లో ఇదే రికార్డు వసూళ్లు. నైజాంలో దాదాపు 2.5 కోట్లు తెచ్చుకన్న సర్కార్, సీడెడ్‌లో రూ.1.8 కోట్లు సాధించింది. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీపావళికి వచ్చిన తెలుగు సినిమాలు బోల్తా కొట్టడం, సర్కార్‌లో కొన్ని వివాదాస్పద అంశాలు ఉండడం.. బాగా కలిసొచ్చింది.