సినిమాల్లో హీరోలు స్మోక్ చేయడం డ్రింక్ చేయడం మామూలే. అయితే అదంతా కొన్నిసార్లు నిజం. కొన్నిసార్లు కల్పితం. లిక్కర్ తాగుతున్నట్లు కనిపించినా, అది లిక్కర్ కాదు. సినిమా కోసం కొన్ని కొన్ని తప్పవు. ఆ విషయం అందరికీ తెలుసు. కొంతమందికి స్మోకింగ్ అంటే ఇష్టం ఉండదు. సిగరెట్ ప్లేస్‌లో, టొబాకో రహితంగా తయారు చేసిన సిగరెట్ లాంటి వస్తువును పెడతారు. సినిమా అంటే సినిమానే.
అయినా కానీ, తమ అభిమాన హీరోల్ని ఫాలో అయ్యే అభిమానులు చెడు అలవాట్లకు బానిసలవడం చాలామంది హీరోలకు నచ్చదు. మద్యపానానికి, ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. తమిళ హీరో విజయ్ ఇకపై సినిమాల్లో స్మోకింగ్, డ్రింకింగ్ సన్నివేశాల్లో కనిపించబోనని కొన్నాళ్ల క్రితం చెప్పాడు. అయితే తన కొత్త సినిమా సర్కార్ కోసం మాట తప్పాల్సి వచ్చింది.
ఇది ఆయన్ని వివాదాల్లోకి లాగింది. 'అదిరింది' సినిమాపై రాజకీయ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వివాదాన్ని రాజేసినవాళ్లు ఇప్పుడు 'సర్కార్' ఫస్ట్‌లుక్‌లో విజయ్ సిగరెట్ కాల్చుతున్న ఫోటోని వివాదాల్లోకి లాగుతున్నారు. విజయ్ అభిమానులు మాత్రం ఈ వివాదాన్ని లైట్ తీస్కోమంటున్నారు.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'సర్కార్' సినిమాలోని విజయ్‌ని చూసి కొంతమంది రాజకీయ నాయకులు భయపడుతున్నారని అభిమానులు అంటున్నారు. ఈ వివాదరపై విజయ్ ఏమంటాడో చూడాలి.