దర్శకురాలిగా విజయ నిర్మల స్కోరు 44 సినిమాలు. చలన చిత్ర చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాలేని రికార్డు ఇది. అందుకే గిన్నీస్ బుక్ లో ఆమె పేరు లిఖించేశారు. అయితే... 50 సినిమాల మైలు రాయి చేరుకోవాలని ఆమెకు ఆశగా ఉండేది. నేరము - శిక్ష దర్శకురాలిగా ఆమె ఆఖరి చిత్రం. ఆ తరవాత కూడా మెగాఫోన్ పట్టాలని భావించారు. కానీ ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్లు నటన, దర్శకత్వానికి దూరమయ్యారు.
అనారోగ్యం నుంచి కోలుకున్న తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టాలని ఆశగా అనిపించింది. అందుకే తరచూ ''ఆరు సినిమాలు చేస్తే నా 50 సినిమాలు పూర్తవుతాయి. అందుకోసమైనా మళ్లీ దర్శకత్వం వహిస్తా'' అని చెప్పేవారు. మహేష్ నటించిన 'సీతమ్మ వాటిల్లో సిరిమల్లె చెట్టు' ఆమెకు బాగా నచ్చింది.
ఆ సినిమా విడుదలైన రోజుల్లో ''ఈ సినిమా నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలపై సినిమా తీస్తే ఆడుతుందన్న భరోసా కలిగింది. నేనూ అలాంటి కథలనే ఇష్టపడతాను. అందుకే ఆ తరహా సినిమాలు తీస్తా'' అని చెప్పేవారు. కానీ... ఆ కోరిక తీరకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.