దర్శకురాలిగా తెలుగులో విజయ నిర్మల చేసిన తొలి చిత్రం 'మీనా'. అదో నవల. అప్పటికే చాలా పాపులర్ అయిపోయింది. ఆ నవలని విజయ నిర్శలగా సినిమాగా తీస్తోందనగానే అంతా అనుమానించారు. అంత మంచి నవల పాడు చేస్తుందేమో అన్న భయం మొదలైంది. మీనాలో ఓకీలక పాత్ర పోషించారు గుమ్మడి. ఆయనకూ అదే సందేహం. ''తొలి సినిమానే గొప్ప నవలని ఎంచుకున్నావు.
జాగ్రత్తగా తీయాలి. లేదంటే అభాసుపాలవుతావు'' అని నిర్మలని హెచ్చరించారాయన. కానీ నిర్మల వినలేదు. తొలి రోజు షూటింగ్‌లో విజయ నిర్మల కంగారు పడకుండా టక టక సీన్లు తీసుకుంటూ వెళ్లిపోయారు. ' ఇంత ఫాస్టుగా సినిమా తీస్తున్నావ్. ఇలాగైతే సినిమా చుట్టేసినట్టు అవుతుంది' అని కోపగించుకున్నారు కూడా. అయితే విజయ నిర్మల మరుసటి రోజే ఆ సీన్లని ఎడిట్ చేసి గుమ్మడికి చూపించారు. దాంతో గుమ్మడి శాంతించారు.
`సినిమాని ఇంత వేగంగా తీస్తావని అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది. కీప్ ఇట్ అప్` అని మెచ్చుకున్నారు. అంతే కాదు.. `పని రాక్షసి` అంటూ ముద్దుగా బిరుదు కూడా ఇచ్చారు. ఆ తరవాత విజయ నిర్మల ఎక్కడ కనిపించినా గుమ్మడి అలానే పలకరించేవార్ట.