'వినయ విధేయ రామ' సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయ్యాక టాలీవుడ్‌లో ఈక్వేషన్స్ మారిపోవడం మొదలైంది. రేసులో 'ఎన్‌టిఆర్ బయోపిక్' ఫస్ట్ పార్ట్ అయిన 'ఎన్‌టిఆర్ కథానాయకుడు', విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఎఫ్-2' నిలవగా, మరికొన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ డేట్స్‌ని దాదాపు ఫైనల్ చేసుకున్నాయి.
అయితే 'వినయ విధేయ రామ' పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందడంతో, సంక్రాంతికి రావాలనుకుంటున్న మిగతా సినిమాలు సైడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 'వినయ విధేయ రామ' సంక్రాంతికి ఫిక్స్ అయినా, డేట్ విషయంలో కొంత గందరగోళం కన్పిస్తోంది. ఈ సినిమా డేట్‌ని బట్టి మిగతా సినిమాలూ తమ డేట్‌ని మార్చుకోవచ్చని సమాచారం. వీటిల్లో 'ఎన్‌టిఆర్ బయోపిక్', 'ఎఫ్2' కూడా వున్నాయట. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు రంగంలోకి దిగి, సంక్రాంతి ఫైట్ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోనున్నారని సమాచారమ్.
ఓ పెద్ద సినిమాకి, మరో పెద్ద సినిమాకీ మధ్య 'హెల్దీ గ్యాప్' తప్పనిసరి. ఒకటి రెండు రోజులు కనీసం గ్యాప్ వుంటే.. పెద్ద సినిమాలు ఆరోగ్యకరంగా వసూళ్ళను రాబడ్తాయి. లేదంటే, ఏదో ఒక సినిమా వసూళ్ళపై ఇంపాక్ట్ గట్టిగా పడే ప్రమాదం వుంది. 'ఎన్‌టిఆర్ బయోపిక్' మీద భారీ అంచనాలున్నాయి. 'వినయ విధేయ రామ' సంగతి సరే సరి.
బాలయ్యకీ, రామ్‌చరణ్‌కీ ఈ సినిమా ఫైట్ కొత్తేమీ కాదు. గతంలో నిర్మాతగా 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రేసులో నిలిచాడు రామ్‌చరణ్. అదే సంక్రాంతికి బాలయ్య తన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని తీసుకొచ్చాడు. ఈసారి బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న 'ఎన్‌టిఆర్ బయోపిక్', రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 'వినయ విధేయ రామ' పోటీ పడ్తున్నాయి.