Virata Parvam Review: విరాటపర్వం మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: రానా, సాయి పల్లవి, ప్రియమని, నవీన్ చంద్ర తదితరులు
దర్శకత్వం : వేణు ఊడుగుల
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: డ్యానీ సాంకేజ్ లోపెజ్, దివాకర్ మని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్


రేటింగ్: 3/5


''ప్రేమించడానికి కారణాలు వుండవు. ఫలితాలు మాత్రమే వుంటాయి'' విరాట పర్వంలో వెన్నెల పాత్ర చెప్పే మాట ఇది. నిజమే.. వెన్నెల ప్రేమకు కూడా కారణాలు వుండవు. ఫలితం మాత్రమే వుంటుంది. ఆ ఫలితం గుండెను పిండేస్తుంది. కాసేపు ఊపిరిని పట్టేస్తుంది. ప్రేమని గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టాలనిపిస్తాది. ప్రేమ ముందు ఉద్యమం చిన్నబోతుంది. వెన్నెల పాత్రకి వున్న ముగింపు ఒక్కసారిగా మనిషిని కదిలించేస్తుంది. ఇంతలా కదిలించేసి  వెన్నెల కథలోకి వెళితే...


కథ:


1990 కాలమది. నక్సల్ దళ నాయకుడు ర‌వ‌న్న అలియాస్ అర‌ణ్య (రానా) ర‌చ‌న‌ల‌కు,   ఐడియాలజీకి ప్రభావితురాలైన వెన్నెల (సాయిప‌ల్లవి) రవన్నని ఘాడంగా ప్రేమిస్తుంది. వెన్నెల తండ్రి (సాయి చంద్) తల్లి (ఈశ్వరి రావు) బావ (రాహుల్ రామకృష్ణ)కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయిస్తారు. బావతో పెళ్లి ఇష్టం లేదని చెప్పేసిన వెన్నెల.. మరుసటిరోజే తాను రవన్నని వెతుక్కుంటూ వెళ్తున్నాని ఉత్తరం రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మరి రవన్నని వెన్నెల కలిసిందా ? ఉద్యమమే ఊపిరిగా బ్రతుకుతున్న రవన్న , వెన్నెల ప్రేమని అంగీకరించాడా ? చివరికి వెన్నెల కథకి ఎలాంటి ముగింపు దొరికింది అనేది మిగతా కథ. 


విశ్లేషణ:


యాధార్ధ సంఘటనలు ఆధారంగా తీసిన కథ ఇది. నక్సల్ ఐడియాలజీకు ప్రభావితురాలై నక్సల్ లో కలసిన సరళ అనే అమ్మాయి జీవితం ఎలా ముగిసిందనే  కొంత సామాజిక మాధ్యమాల్లో వుంది. దర్శకుడు వేణు ఉడుగుల సరళ పాత్రని వెన్నెలగా మార్చుకొని ఈ కథని రాసుకున్నాడు. ఒక పండు వెన్నెల్లో పోలీసులకు నక్సల్ మధ్య జరుగుతున్న వార్ కథని ఓపెన్ చేసిన దర్శకుడు ఒక లేడి నక్సల్ ఈశ్వరి రావ్ కి పురుడుపోయడంతో ఈ కథ మొదలౌతుంది. పుట్టిన బిడ్డకు ఆమెనే వెన్నెల అని పేరుపెడుతుంది. తర్వాత వెన్నెల జీవితంలో ఒకొక్కదశ చూపించుకుంటూ వెళ్ళిన దర్శకుడు ఆమె పాత్ర స్వభావాన్ని ఎస్టాబ్లెస్ చేసుకుంటూ వెళ్ళాడు. తనకు ఇష్టమైన బొమ్మ కోసం బావిలో దూకేయడం, పెళ్లి వద్దని నేరుగా బావతోనే చెప్పడం, జాతరలో పోలీసులపై తిరగబడటం ఇలాంటి సన్నీవేషాలన్నీ వెన్నెల పాత్ర స్వభావాన్ని తెలియజేయడానికి తీర్చిదిద్దారు. 


తండ్రి ఒగ్గు కథలు చెప్పే కళాకారుడు కావడంతో చిన్నప్పటి నుండే వెన్నెలకు బోలెడు చరిత్ర, కథలు చెప్పడం, వెన్నెలకు పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు వుండటం, అలా అరణ్య రాసిన పుస్తకం వెన్నెల చేతికి రావడంతో ఒక్కసారిగా కథలో వేగం వస్తుంది. అరణ్య కవిత్వంతోనే రవన్న పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ కవిత్వమే గొప్ప నేపధ్య సంగీతంలా వుంటుంది. ఆ అక్షరాల్లో స్ఫూర్తి వెన్నెల పాత్రలో నిండిపోతుంది. అరణ్య అక్షరంపై పెంచుకున్న అభిమానం ప్రేమగా మారిపోతుంది. కృష్ణుడ్నీ ప్రేమించిన మీరాబాయిలా వెన్నెలది కూడా అనిర్వచనీయమైన ప్రేమ. మీరా బాయి కృష్ణుడు కోసం ఇల్లువదిలినట్లు వెన్నెల, రవన్న కోసం ఇల్లు వదిలి చేసిన అన్వేషణ ఒక మీరాబాయిని గుర్తుకు తెస్తుంది. ఈ అన్వేషణ కొంత సాగాదీత అనిపించినా .. వెన్నెల కథ చెప్పడానికి మరో అవకాశం లేదు. వెన్నెల అన్వేషణలోనే కథ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే మానవహక్కులు, విరసం, మావో పార్టీలు .. వీటి గురించి మరీ వివరాల్లోకి వెళ్ళలేదు దర్శకుడు. అందుకే ఈ కథని ప్రేక్షకుడు ఫాలో అవ్వాలంటే నక్సల్ మూమెంట్, విప్లవ సాహిత్యం గురించి పరిచయం లేకపోయినా కనీసం ఎక్కడోదగ్గర వినుండాలి. పోలీసులు, రవన్నని వెన్నెల కలిసే సీన్ కథ లో ఇంటర్వెల్. అనీర్వచనీయమైన ప్రేమతో రవన్నని కలసిన వెన్నెల..  తన ప్రేమ గురించి   రవన్నతో చెప్పినపుడు.. ఉద్యమం ఆమె ప్రేమ ముందు చిన్నబోయినట్లనిపిస్తుంది. ఇది నిజంగా దర్శకుడి ప్రతిభే. వెన్నెల పాత్రని అంత బలంగా డిజైన్ చేశాడు. 


ద్వితీయార్ధంలో కూడా వెన్నెల పాత్రలో చాలా వరకూ ఎడబాటే కనిపిస్తుంది. వెన్నెల ప్రేమలో ఉన్న ఘాడతని అర్ధం చేసుకోలేని రవన్న, ఆమెను దళానికి దూరం ఉంచడం, ఈ క్రమంలో కొంత కాలం టీచర్(నందితా దాస్) ఇంట్లో వుండటం వారి మధ్య ప్రేమ గురించి జరిగిన చర్చా, పోలీసులు వెన్నెల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వంటి సన్నీవేషాలు కథని కాస్త మందగమనంతో నడుపుతాయి. అయితే వెన్నెల దళంలో చేరిన తర్వాత ఒక్కసారిగా కథ మళ్ళీ వేగం పుంజుకుటుంది. వెన్నెల, రవన్న జీవితంలోకి వచ్చిన తర్వాత అతనిలో మానవీయ కోణం ను ఆవిష్కరించాడు దర్శకుడు. హాస్పిటల్ లో రవన్న తల్లిని కలవడం, కవిత్వం చెప్పడం, 'తుపాకీ గొట్టంలో శాంతి లేదు. అమ్మాయి ప్రేమలోనే శాంతి'' అనే మాట టచింగా వుంటాయి. 


దిని తర్వాత కథ ఒక్కసారిగా క్లైమాక్స్ లోకి వెళ్ళిపోతుంది. దళంలో కోవర్ట్ లున్నారనే  పోలీసులాడిన డ్రామా.,. పాపం..  వెన్నెలకి శాపంగా మారుతుంది. శత్రువుకి కూడా రాకూడని శాపం అది. ఒక స్వచ్చమైన ప్రేమ ముగిసిపోతుంది. అలాంటి ముగింపు కన్నీళ్లు తెప్పిస్తుంది. చిన్నప్పుడు బావీలో పడిపోయిన వెన్నెల బ్రతికినట్లు... మరొక్కసారి వెన్నెల ఊపిరి పీల్చుకుంటే బావుంటుందని ప్రతి గుండె కొట్టుకుంటుంది. ప్రేమని ఓడించడం చాలా కష్టం. కానీ వెన్నెల ముందు ప్రేమ దారుణంగా ఓడిపోయింది. వెన్నెల నిలిచిపోయింది.


నటీనటులు:


సాయి పల్లవి సినిమా ఇది. నిజంగా సాయి పల్లవి లేకపోతే విరాట పర్వం ఇంత ప్రభావవంతంగా వచ్చేది కాదు. అంత గొప్పగా వెన్నెల పాత్రని పోషించింది సాయి పల్లవి. సచిన్ ముందు మెగ్గ్రత్, గిల్లిస్పి, అక్తర్ లాంటి పొడుగాటి బౌలర్లు చిన్నబోయినట్లు.. భళ్ళాళ దేవ కటౌట్ వున్న రానా, సాయిన్ పల్లవి ముందు చాలా సాదాసీదాగ కనిపించాడు. తన ప్రేమని రవన్నకి చెప్పడం, తండ్రిని కలసి కన్నీళ్లు పెట్టుకోవడం, క్లైమాక్స్ లో సాయి పల్లవి నటవిశ్వరూపం కనిపిస్తుంది.

 

రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. కవిత్వానికి రానా వాయిస్ చాలా ప్లస్ అయ్యింది. రానా కవిత్వం చెబుతుంటే చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. రానా ఏ పాత్ర చేసిన సహజంగా వుంటుంది. రవన్న పాత్రలో కూడా చాలా సహజంగా పోషించారు రానా.


సాయి చంద్, ప్రియమణి, నవీన్ చంద్ర, నందిత దాస్, ఈశ్వరీరావు, జ‌రీనా వ‌హాబ్‌, రాహుల్ రామ‌కృష్ణ, బెన‌ర్జీ పాత్రలు కీలకమైనవి. పాత్రలన్నీ హుందాగా పోషించారు. మిగతా నటులు పరిధిమేర చేశారు.         


టెక్నికల్ గా:


సాంకేతికంగా విరాటపర్వం ఉన్నంతగా వుంది. డానీ, దివాకర్ మణి కెమరాపని తనం ఆకట్టుకుంటుంది. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం అద్భుతంగా వుంది. కవిత్వాలని పాటలుగా మార్చడం వలన చాలా వరకూ పాటలు అంతగా రిజిస్టర్ కాలేదు. కొత్తగా మాత్రం వున్నాయి. ఎడిటర్ షార్ఫ్ గా వర్క్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల అన్వేషణకి ఒకటి రెండు చోట్ల కత్తెర వేసే అవకాశం వున్నా ఆ చాయిస్ తీసుకోలేదు.


ఆర్ట్ వర్క్ బావుంది. డైలాగ్స్ కవిత్వంలానే ప్రతిధ్వనించాయి. చాలా సీరియస్ కథ ఇది. ''చప్పట్లు విజల్స్ కోసం చేసిన సినిమా కాదు. నిశబ్ధంగా కూర్చుని దీనమ్మ ఇది నిజమా కదా'' అని ఫీలయ్యేవారి కోసం చేసిన సినిమా ఇదాని రానా స్పష్టంగా చెప్పారు. సినిమా కూడా అలానే వుంది. ఇంత సీరియస్ లేయర్ లో ఎలాంటి తడబాటు లేకుండా ఒక ప్రేమకథని చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. 


ప్లస్ పాయింట్స్


సాయి పల్లవి 
రానా 
ముగింపు 


మైనస పాయింట్స్ 


ఫస్ట్ హాఫ్ లో కొంత సాగదీత 
నక్సల్ డ్రామా రొటీన్ గా వుండటం 


ఫైనల్ వర్దిక్ట్: వెన్నెల కోసం విరాటపర్వం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS