కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ థియేటర్లన్నీ బొక్క బోర్లా పడ్డాయి. మరో నాలుగు నెలల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నది నిపుణుల మాట. అందుకే నిర్మాతలు ప్రత్యామ్నాయ ప్రయత్నాల వైపు దృష్టి సారించారు. ఓటీటీ ఓ మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది. చిన్నా చితకా సినిమాలు ఓటీటీ వైపు వెళ్లడం ఖాయం. మధ్యస్థాయి చిత్రాలే అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. వాటిలో విరాటపర్వం ఒకటి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి ఈసినిమా విడుదల కావాల్సింది. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే చెప్పింది. ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది.
విరాట పర్వం చిత్రానికి నెట్ ఫ్లిక్స్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రూ.30 కోట్లకు ఈ సినిమాని కొంటామని నెట్ ఫ్లిక్స్ రంగంలోకి దిగిందట. 30 కోట్లంటే చాలా మంచి ఆఫర్ కిందే లెక్క. రానా గత చిత్రం `అరణ్య` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే.. ఇది తిరుగులేని ఆఫర్. మరి.. సురేష్ ప్రొడక్షన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.