హీరో విశాల్ గత మూడేళ్ళ నుండి అటు నడిగర్ సంఘంతో పాటు ఇటు రాజకీయాల్లోనూ చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. దీనితో సినిమాలతో సంబంధం లేకుండా ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయాడు.
ఇదే సమయంలో ఆయన తాజా చిత్రం అభిమన్యుడు తెలుగులో విడుదల కావడం, మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రం తమిళనాట లానే ఇక్కడ కూడా మంచి హిట్ గా నిలిచింది. దీనితో విశాల్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమాకి ప్రచారం చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే విశాల్ నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది, కారణం- ఆయన అందులో రాజకీయాలకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు. ఇంతకి ఆయన చెప్పిందేంటంటే తనకి సాధారణ జనసామాన్యం లాగా ఇంట్లో కూర్చుని రాజకీయ నాయకులని తిట్టే మనస్తత్వం కాదని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి తప్పులని సరిద్దిదడమే ఇష్టం అని చెప్పాడు.
అందుకోసమే మొన్న ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలిపాడు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ పాత్ర ఏంటి అన్న ప్రశ్నకి- అది ఇప్పుడున్న రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. వారు తమ పనిని సక్రమంగా చేస్తే తనలాంటి వారికి రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఏంటి అని తన మనసులో మాట చెప్పాడు.
అయితే రాజకీయ అంటే ప్రజలకి సేవ అని అందుకనే తాను ఎల్లప్పుడు రాజకీయాల్లోనే ఉన్నట్టుగా భావిస్తాను అని తెలిపాడు. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ- వైఎస్ జగన్ అంటే తనకి ప్రత్యెక అభిమానం అని చెప్పడం కొసమెరుపు.