నటుడు, నిర్మాత విశాల్ ఇప్పుడు కొత్త బాధ్యతని నెత్తిమీద వేసుకొన్నారు. డిటెక్టీవ్ 2 కి తానే దర్శకుడ్నంటూ ప్రకటించుకొన్నారు. నిజానికి డైరెక్షన్ వైపు రావాలని విశాల్ ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. అది ఇప్పటికి తీరింది. డిటెక్టీవ్ హిట్ సినిమా కాబట్టి, ఈ సీక్వెల్ పై అంచనాలు ఉండడం సహజం. ఇప్పుడు అవి మరింతగా పెరుగుతాయి. అయితే.. ఈ సినిమా బయటకు రావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే.. ఈ డిటెక్టీవ్ చుట్టూ ఓ వివాదం ముసిరి ఉంది.
డిటెక్టీవ్ కి మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బాగా ఆడింది. దాంతో సహజంగానే మిస్కిన్‌తో విశాల్ రాపో పెరిగింది. ఆ వెంటనే ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. కొంత మేర వర్క్ జరిగింది. కానీ ఆ తరవాత మిస్కిన్, విశాల్ మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకోవాల్సివచ్చింది. ఇప్పుడు మిస్కిన్ స్థానంలో విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా ఐడియా వెనుక, కథ, కథనాల వెనుక మిస్కిన్ క్రియేటీవ్ బ్రెయిన్ ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఇప్పుడు అదే ఐడియాతో విశాల్ సినిమా తీస్తున్నాడు. దాంతో ఈ సినిమా బయటకు రావాలంటే మిస్కిన్ అనుమతులు తప్పని సరి. మరి.. మిస్కిన్ అందుకు ఒప్పుకొంటాడా? అనేది అనుమానం.
ఎందుకంటే మిస్కిన్‌తో విశాల్ గొడవ చిన్నది కాదు. ఓ దశలో తమిళ ఇండస్ట్రీని కుదిపేసింది. దర్శకుల సంఘం, నిర్మాతల మండలిలో పెద్ద చర్చ నడిచింది. ఇప్పటికైతే మిస్కిన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. సినిమా పూర్తయిన తరవాత, విడుదలకు ముందు మిస్కిన్ మొండిపట్టు పడితే అప్పుడు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. అసలు ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ఎందుకనే.. డిటెక్టీవ్ 2 సినిమాకు దర్శకత్వం వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఆ బాధ్యతనీ తనే తీసుకొన్నాడు విశాల్. ఇప్పుడు మిస్కిన్‌పై పోరాటం కూడా విశాలే చేయాలి.