అది కుళ్లు జోకుల సినిమానా.. ఎంత మాట‌.. ఎంత మాటా?

By Gowthami - April 02, 2020 - 15:39 PM IST

మరిన్ని వార్తలు

విశ్వ‌క్ సేన్‌.. ఈ పేరు త‌ర‌చూ వార్త‌ల్లో వినిపిస్తూనే ఉంది. చేసిన సినిమాలు త‌క్కువే. కానీ పేల్చిన బాంబుల మాత్రం ఎక్కువ‌. మైకు ప‌ట్టుకుంటే ఏం మాట్లాడ‌తాడో త‌న‌కే అర్థం కాదు. ఇలా త‌ల‌తిక్క‌గా మాట్లాడితేనే ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నుకుంటాడో, లేదంటే.. త‌న నైజ‌మే అదేనో తెలీదు గానీ, విశ్వ‌క్ మాట‌లు సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అవుతుంటాయి. ఫ‌ల‌క్ నామా దాస్ టైమ్ లో వెరైటీ స్టేట్‌మెంట్లతో షాకిచ్చాడు విశ్వ‌క్ సేన్‌. ఆమ‌ధ్య లాక్ డౌన్ సంద‌ర్భంగానూ నోరు జారాడు. ఆ త‌ర‌వాత సారీ చెప్పాల్సివ‌చ్చింద‌నుకోండి.. అది వేరే విష‌యం.

 

ఇప్పుడు వెంక‌టేష్ - వ‌రుణ్‌తేజ్ న‌టించిన `ఎఫ్ 2` సినిమాపై సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో త‌న‌కు న‌చ్చ‌ని సినిమా గురించి ప్ర‌స్తావించ‌మంటే `ఎఫ్ 2` పేరు చెప్పాడు. అస‌లు ఇందులో క‌థే లేద‌ని, పావుగంట‌కు మించి ఎక్కువ సేపు చూడ‌లేక‌పోయాన‌ని, కుళ్లు జోకులు పేర్చి.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు అర్థం మార్చేశార‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. అయినా ఈ సినిమా హిట్ట‌యింద‌ని, వంద కోట్లు రాబ‌ట్టింద‌ని, ఇలాంటి క‌థ‌ల‌తో జ‌నాన్ని మెప్పించ‌డం కూడా టెక్నిక్కే అని.. ఆయింట్ మెంట్ పూసే ప్ర‌య‌త్నం చేశాడు. వంద కోట్లు సంపాదించిన సినిమాని కుళ్లు జోకుల సినిమాగా అభివ‌ర్ణించ‌డం విశ్వ‌క్ కే చెల్లింది. వెంక‌టేష్ లాంటి అగ్ర క‌థానాయ‌కుడు న‌టించిన చిత్ర‌మిది. సీనియ‌ర్ల‌పై గౌర‌వం లేకుండా ఇలా ఓ సినిమాపై నెగిటీవ్ కామెంట్లు చేయ‌డం, అది కూడా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన సినిమాని కించ‌ప‌ర‌డం చూస్తుంటే విశ్వ‌క్‌కి ప్ర‌జా తీర్పుపై గౌర‌వం లేన‌ట్టే క‌నిపిస్తోంది. అన్న‌ట్టు... `కంచ‌ర‌పాలెం` త‌న దృష్టిలో మాంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అట‌. అయితే ఆ సినిమాకి మాత్రం డ‌బ్బులు రాలేదు. మ‌రి ఏ లెక్క‌లో అది క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయ్యిందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS