వినాయక్ హీరోగా, దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తంలో ఈ చిత్రం పట్టాలెక్కిందో, అప్పటి నుంచీ సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక... అవుట్ పుట్‌పై దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఈ సినిమా ఆగిపోయింది. మధ్యలో కొన్ని రిపేర్లు జరిగాయి. కథ మార్చారు. అటు వినాయక్‌కీ, ఇటు దిల్ రాజుకీ దర్శకుడు ఫైనల్ నేరేషన్ ఇచ్చాడు. షూటింగ్ మళ్లీ ప్రారంభించారు. కానీ ఇంతలో ఏమైందో ఈ సినిమా మళ్లీ ఆగింది. ఈ కథలో ఇప్పటికీ రిపేర్లు జరుగుతున్నాయని టాక్. ఈ స్క్రిప్టుపై అటు దిల్ రాజుకీ, ఇటు వినాయక్ కి చాలా అనుమానాలు ఉన్నాయట.
ఇన్ని అనుమానాల మధ్య సినిమా తీసినా వర్కవుట్ అవ్వదని దిల్ రాజు భయపడుతున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ఈ కథని పరుచూరి బ్రదర్స్ దగ్గరకు పంపినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో వాళ్లకు స్క్రిప్ట్ డాక్టర్స్ అని పేరుంది. పరుచూరి బ్రదర్స్ ఈ కథంతా విని, కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నారట. వాళ్ల వెర్షన్ కూడా పూర్తయ్యాక వినాయక్, దిల్ రాజులకు మళ్లీ ఈ కథ వినిపిస్తారు. ఆ తరవాత.. ఈ సినిమాని పట్టాలెక్కించాలా, లేదంటే ఆపేయాలా అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటార్ట.