హిందీలో తెలుగు సినిమాల మార్కెట్ రోజు రోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మన సినిమాలు డబ్బింగుల రూపంలో దక్షిణాదికి చేరువ అవుతున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలు యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే.. చిన్న సినిమాలకు యూ ట్యూబ్ క్రేజ్ తక్కువ. అయితే... కంటెంట్ ఉన్న సినిమాల్లో స్టార్లు లేకున్నా ఆదరిస్తారన్న విషయం మరోమారు రుజువైంది. ఓ చిన్న సినిమాకు యూ ట్యూబ్ లో వస్తున్న హిట్స్, వ్యూస్ ఇందుకు ఉదాహరణ.
ఐదేళ్ల క్రితం తెలుగులో విడుదలైన సినిమా `వీకెండ్ లవ్`. నాగు గవర దర్శకత్వం వహించారు. ఈ సినిమా కి తెలుగులో మంచి స్పందనే వచ్చింది. ఆ తరవాత... హిందీలో డబ్ అయ్యింది. ఇప్పటి వరకూ ఈ సినిమాకి 29 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఓ చిన్న సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం... అపూర్వమే అనుకోవాలి. ఫస్ట్ లవ్, లవ్ స్టోరీ, ఐ హేట్ లవ్ స్టోరీ.. ఇలా పలు పేర్లతో.. హిందీలో డబ్ అయ్యింది ఈ సినిమా. ప్రతీ సారీ కోట్లలో వ్యూస్ దక్కించుకుంది. హిందీకి సంబంధించిన స్టార్లు, టెక్నీషియన్లు లేకపోయినా..ఈ స్థాయిలో వ్యూస్ రావడం చూసి.. చిత్రసీమ నివ్వెర పోతోంది. యూ ట్యూబ్ లో ఇది పెద్ద హిట్ కిందే లెక్క. నాగు గరవ దర్శకత్వంలో వచ్చిన `కర్త కర్మ క్రియ`ని సైతం.. హిందీలోకి డబ్ చేయాలని చూస్తున్నారు. అంతే కాదు... ఈ యువ దర్శకుడికి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయి.