బాలు అజాత శత్రువు. వివాదాలకు దూరం. చిన్న చిన్న గొడవలు వచ్చినా - బాలు నెమ్మదితనం వల్ల సర్దుకుపోయేవి. ఆయన్ని అందరూ ప్రేమించేవారే. ఇక గొడవలెక్కడివి. అయితే.. కృష్ణతో మాత్రం చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల కొన్నేళ్ల వరకూ - ఆయన సినిమాలకు పాటలు పాడడం మానేశారు బాలు. బాలుని పిలవడం మానేశారు కృష్ణ. మధ్యలో ఎంతమంది వీరిద్దరికి సయోధ్య కుదర్చాలని భావించినా కుదర్లేదు.
ఇంతకీ ఈ గొడవెందుకు వచ్చింది? చివరికి ఎలా కలిశారు? ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. పద్మాలయా స్టూడియో నుంచి బాలుకి రావాల్సిన కొన్ని చెక్‌లు చాలా కాలం వరకూ అందలేదు. రావల్సిన డబ్బు కోసం పద్మాలయా స్టూడియోకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన స్పందన లేకపోవడంతో ఓసారి బాలునే.. `ఇలా అయితే ఎలా..?` అన్నట్టు కాస్త సీరియస్ అయ్యారు. ఈ విషయం కృష్ణకు తెలిసింది. ఆయన ఫోన్ చేసి.. `డబ్బులు ఇవ్వకపోతే నాకు పాటలు పాడరా? అయితే మీ పాట నాకు అవసరం లేదు.
మీ స్నేహితుడు మాకు 20 వేలు ఇవ్వాలి. ఆ డబ్బుని మీరే పంపాలి` అంటూ... ఫోన్ పెట్టేశారు. ఫోన్లో.. బాలు ఎంత సర్దిచెప్పాలనుకున్నా కృష్ణ మాట వినలేదు. ఆయన కోపం ఆయనది. బాలు స్నేహితుడు ఇవ్వాల్సిన 20వేల చెక్‌ని పద్మాలయా స్టూడియోని వెంటనే పంపించారు బాలు. ఆ తరవాత.. పద్మాలయా నుంచి.. బాలుకి రావాల్సిన చెక్ వచ్చేసింది. అప్పటి నుంచి కృష్ణ సినిమాలకు బాలు పాడలేదు. బాలు స్థానంలో ఎంతోమంది గాయకుల్ని తీసుకొచ్చారు కృష్ణ. అయితే అందులో రాజ్ సీతారాం గొంతు బాలుకి సూట్ అయ్యింది.
`సింహాసనం` సినిమాలో పాటలన్నీ రాజ్ సీతారామ్‌నే పాడారు. దాంతో కొంతకాలం పాటు రాజ్ సీతారామ్ పాటలు మార్మోగిపోయాయి. అయితే బాలూలా ప్రతీ పాటా.. రాజ్ సీతారామ్ పాడలేకపోయారు. వేటూరి లాంటి పెద్దలు బాలు - కృష్ణల మధ్య సయోధ్య చేయాలని చూశారు. కానీ అటు బాలు గానీ, ఇటు కృష్ణ గానీ ఒక్క అడుగూ ముందుకు వేయలేదు.
అయితే ఓసారి.. బాలు ఏమనుకున్నారో ఏమో.. సరాసరి పద్మాలయా స్టూడియోకి వెళ్లిపోయార్ట. బాలుని చూసి, పద్మాలయాలోని ఉద్యోగులు కాస్త కంగారు పడ్డార్ట. `ఇద్దరికీ పడడం లేదు కదా. ఇప్పుడేమైనా గొడవ అవుతుందేమో` అని భయపడ్డార్ట. అయితే.. బాలుని చూడగానే కృష్ణ నవ్వుతూ పలకరించార్ట. బాలు ఏదో చెప్ప బోతుంటే... `ఏం చెప్పొద్దు బాలుగారూ... ఇక నుంచి మనం కలిసి పనిచేద్దాం` అని షేక్ హ్యాండ్ ఇచ్చార్ట. అలా.. టీ కప్పులో తుపానులాంటి గొడవ... చప్పున సర్దుమణిగిపోయింది. ఈ విషయాన్ని బాలూనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.