షూటింగులకు అనుమతి రాబోతోందా?
మళ్లీ షూటింగులు ఎప్పుడు?
సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి?
థియేటర్లు మునుపటిలా ఎప్పుడు కళకళలాడతాయి?
అందరిలోనూ ఇవే ప్రశ్నలు. లాక్ డౌన్ వల్ల వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. చిత్రసీమ దానికి అతీతం కాదు. అటు సినిమా షూటింగులు, సీరియళ్లూ ఆగిపోయాయి. ఇలా ఎంతకాలం? ఒక్కో పరిశ్రమా మెల్లమెల్లగా తెరచుకుంటోంది. తన కార్యకలాపాల్ని ప్రారంభిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా పనులు చేసుకోవొచ్చని ప్రభుత్వాలూ ప్రకటిస్తున్నాయి. మరి సినిమా షూటింగుల మాటేమిటి? ఈ విషయమై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ని సంప్రదించాయి అటు సినీ, ఇటు టీవీ వర్గాలు. మొన్నటికి మొన్న టీవీ ఛానళ్ల ప్రతినిధులు మంత్రిని కలిసి, టీవీ షూటింగులకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాయి.
ఈరోజు తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధులు మంత్రిని కలిసి మొమొరాండం సమర్పించాయి. అందులోని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే షూటింగుల అనుమతి విషయంలో తొందరపడే ప్రసక్తే లేదని, అన్ని విషయాల్నీ లోతుగా పరిశీలించే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈనెలలో షూటింగులు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభం కావని, జూన్ వరకూ ఆగాల్సిందేనని చెప్పుకొచ్చారు. కరోనా ఎప్పుడు ఏ రూపంలో విజృంభిస్తుందో చెప్పలేమని, అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని తేల్చి చెప్పేశారు.
షూటింగుల అనుమతి విషయంలో కేరళ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఏయే ప్రభుత్వాలు చిత్రసీమ విషయంలో ఎలా స్పందించాయో తెలుసుకుని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతోనూ చర్చించి, సినీ పెద్దలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని, పరిశ్రమకు మంచి చేసేలా ఆలోచిస్తామని మంత్రి పేర్కొన్నారు. బ్యాంకుల్లో అప్పుడు తీసుకుని సినిమాలు నిర్మించి, ఇప్పుడు ఆ వడ్డీలు భారమవుతున్న వేళ.. బ్యాంకర్లతో కూర్చుని మాట్లాడి, నిర్మాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.