శివాజీ - ఆపరేషన్ గరుడ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు ఈ రెండు పేర్లూ యమ ఫేమస్. వైట్ బోర్డులో ఏవేవో స్కెచ్చులు వేసి - రాజకీయాల్లో వచ్చే పెను మార్పులు, వాటికి గల కారణాల గురించి కూలంకుశంగా వివరించేవాడు. అవి జరిగాయో, లేదో తరువాతి సంగతి - వినడానికి మాత్రం భలే ఆసక్తిగా ఉండేవి. ఆపరేషన్ గరుడ అంటూ.. తెర వెనుక ఏవేవో రాజకీయ కుట్రలు జరిగిపోతున్నట్టు, చంద్రబాబు నాయుడుని గద్దె దించడానికి కేంద్రం చాలా రకాల ఎత్తులు వేస్తున్నట్టు ఆయన రకరకాల కథనాలు వండి వార్చారు.
దానికి మీడియాలోనూ మంచి కవరేజీ వచ్చేది. టీవీ 9 లాంటి మీడియా అండదండలు శివాజీకి ఉండడంతో ప్రతీ రోజూ ఏదో ఓ రూపంలో ఆయన టీవీల్లో కనిపించేవారు. సోషల్ మీడియాలోనూ.. చెలరేగిపోయేవారు. ఎన్నికలు అయిపోయాక సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ గెలుపు కోసం బలంగా పోరాడిన శివాజీ - ఆ తరవాత కనిపించడం మానేశారు. టీవీ 9కి సంబంధించిన వివాదం కూడా ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన్ని అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో శివాజీ మాయం అయిపోయారు. ఆ మధ్య ఆయన ఓ వీడియో వదిలారు. `నేను ఎక్కడికీ పారిపోలేదు. న్యాయం నా వెంటే ఉంది` అని సెలవిచ్చారు. కానీ ఆయన జాడ మాత్రం కనిపించడం లేదు. ఆయన బ్యాంకాక్ వెళ్లిపోయారని కొంతమంది, ఆయన అమెరికాలో ఉన్నారని మరికొంతమంది చెబుతున్నారు. మొత్తానికి గరుడ శివాజీ గాయబ్ అయిపోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి శివాజీ అజ్ఞాతం ఎప్పుడు వీడతాడో చూడాలి.