ఆస్కార్ బరిలో ఆర్.ఆర్.ఆర్ నిలుస్తుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురైంది. ఈ సినిమాకి ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీ దొరకలేదు. ఆ స్థానంలో గుజరాతీ సినిమా `చెల్లో షో`కి అవకాశం దక్కింది. ఆర్.ఆర్.ఆర్ కి ఛాన్స్ లేకపోవడంతో తెలుగు అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. నిజానికి ఆర్.ఆర్.ఆర్. చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చింది. అయితే... `చెల్లో షో` చివరి వరకూ పోటీలో నిలిచి.. జ్యూరీ మనసుల్ని గెలుచుకొంది.
ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ కి వెళ్లే అన్ని అర్హతలూ ఉన్నాయి. కాకపోతే.. `చెల్లో షో`కి ఇంకొన్ని ఎక్కువే కనిపిస్తాయి. ఆస్కార్ జ్యూరీకి భారీదనం, స్టార్లు, కమర్షియల్ హంగులూ వీటితో పనిలేదు. అవే కావాలనుకుంటే.. `బాహుబలి` ఎప్పుడో ఆస్కార్‌కి వెళ్లేది. సున్నితమైన భావోద్వేగాలు, స్ఫూర్తినిచ్చే కథలు, ప్రయోగాత్మక ఆలోచనలు.. వీటికే జ్యూరీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంది. ఈసారీ అదే జరిగింది. ఆర్.ఆర్.ఆర్ ఓ కల్పిత కథ. అల్లూరి, కొమరం భీమ్‌లు కలిస్తే ఎలా ఉంటుందన్నది ఫాంటసీ.
చెల్లో షో అలా కాదు. అదో స్ఫూర్తివంతమైన కథ. దర్శకుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనలనే సన్నివేశాలుగా రాసుకొన్నాడు. తక్కువ బడ్జెట్‌లో ప్రయోగాత్మకంగా తీశారు. అందుకే జ్యూరీ మనసుల్ని గెలుచుకొంది. అయితే చెల్లో షోకి ఆస్కార్ అర్హత లేదంటూ కొంతమంది ఘాటుగా విమర్శిస్తున్నారు. అది ఓ ఇరాన్ సినిమాకి ఫ్రీ మేక్ అని కూడా చెబుతున్నారు. కాపీ సినిమాల్ని ఆస్కార్‌కి ఎలా పంపుతారని నిలదీస్తున్నారు. వీటిపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏం సమాధానం చెబుతుందో చూడాలి.