'గాడ్ ఫాదర్'తో ఓ హిట్టు కొట్టాడు చిరంజీవి. 'ఆచార్య'తో నిరుత్సాహంలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్‌కి ఈ విజయం బూస్టప్ ఇచ్చింది. అయితే.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ స్థానంలో పవన్ కల్యాణ్ నటిస్తే.. ఇంకా బాగుండేదని ఫ్యాన్స్ అనుకొంటున్నారు. పవన్ అయితే.. ఈ హిట్టు మరో రేంజ్ లో ఉండేదన్నది వాళ్ల మాట. ఇదే విషయంపై చిరు స్పందించాడు. 'గాడ్ ఫాదర్' ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి - పూరి జగన్నాథ్ మధ్య లైవ్ లో ఓ చిన్న ఇంటర్వ్యూ నడించింది. ఈసందర్భంగా సల్మాన్ స్థానంలో పవన్ కల్యాణ్ ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు పూరి. దానికి చిరు సమాధానం కూడా ఇచ్చాడు.
సల్మాన్ స్థానంలో పవన్ అయితే బాగుండేదని, తాను అడిగితే తప్పకుండా ఒప్పుకొనే వాడని... చిరు చెప్పుకొచ్చారు. అయితే మిగిలిన భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలనుకోవడం వల్ల... సల్మాన్ ని ఎంచుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు చిరు. ''సల్మాన్ తో చాలా కాలంగా అనుబంధం ఉంది. చరణ్ తో సల్మాన్ చాలా క్లోజ్ గా ఉంటాడు. సల్మాన్ నాకో జాకెట్ ఇచ్చాడు. అది నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉంది. ఈ సినిమా కోసం సల్మాన్ పారితోషికం తీసుకోలేదు. సల్మాన్ ఖాన్ పుట్టిన రోజున చరణ్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు'' అని చెప్పుకొచ్చారు చిరు.