యమలీల... చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం. అలీని హీరోగా మార్చింది ఆ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో అదో సంచలం. అలీ పక్కన కథానాయికగా ఇంద్రజ నటించింది. తనకూ ఈ సినిమా మంచి పేరే తీసుకొచ్చింది. అయితే నిజానికి ఈ సినిమా కథానాయికగా ముందు సౌందర్యని ఎంచుకున్నారు. మరో 5 రోజుల్లో షూటింగ్ మొదలవుతుందగా.. `ఈ సినిమాలో నేను చేయలేను. సారీ` అంటూ సౌందర్య తప్పుకున్నారు.
``ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నా, ఇలాంటి సమయంలో అలీతో సినిమా చేయడం వల్ల చేతిలో ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది`` అంటూ ఎస్వీ కృష్ణారెడ్డిని కన్వెన్స్ చేశార్ట సౌందర్య. దాంతో కృష్ణారెడ్డి కూడా మారు మాట్లాడలేకపోయారు. ``సరే మీ ఇష్టం.`` అని చెప్పి, సౌందర్య స్థానంలో ఇంద్రజని తీసుకున్నారు. సౌందర్య తప్పుకోవడంతో కోట శ్రీనివాసరావు కూడా ఈసినిమా చేయనన్నార్ట. నిజానికి తోట రాముడు పాత్రని కోట శ్రీనివాసరావుతో చేయించాలని అనుకున్నారు. సౌందర్య తప్పుకోవడంతో.. కోట కూడా ఈ సినిమా చేయను.. అని చెప్పేశారు. దాంతో ఈ పాత్రకు తనికెళ్ల భరణి ని తీసుకున్నారు. కానీ చివరికి మనసు మార్చుకుని, `సారీ.. కృష్ణారెడ్డి, ఈ సినిమాలో నేనూ నటిస్తా` అని ఆయన ముందుకు రావడంతో.. ఎస్సై పాత్ర ఆయనకు అప్పగించారు.
ఈ సినిమా హిట్టయ్యాక... మంచి అవకాశాన్ని వదులుకున్నందుకు సౌందర్య చాలా ఫీల్ అయ్యార్ట. ఇదే విషయాన్ని కృష్ణారెడ్డికి చెబుతూ ``ఈసారి మాత్రం మీ సినిమాలో హీరో ఎవరైనా సరే, నేను నటిస్తాను`` అన్నార్ట. అలా.. ఆ తరవాత `మాయలోడు` సినిమాలో బాబూ మోహన్ పక్కన `చినుకు చినుకు` పాటలో నర్తించడానికి ఒప్పుకుంది. ఇదే పాటని `శుభలగ్నం`లో అలీ - సౌందర్యలపై చిత్రీకరించడం విశేషం. ఈ రెండు పాటలూ సౌందర్య చేయడానికి కారణం.. `యమలీల`ని వదులుకోవడమే.