గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ఈ విషయమై కేంద్రానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేయడం చూశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీకి ఈ మేరకు లేఖ కూడా రాశారు. 17 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు, అశేషాభిమానాన్ని దక్కించుకున్నారు దేశవ్యాప్తంగా. ఆయనకు భారత రత్న పురస్కారం దక్కినా, దక్కకున్నా భారత రత్నమే అన్న చర్చ జరుగుతోంది.
అయితే, భారతరత్న పురస్కారం కోసం గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పటికీ ఈ డిమాండ్ అలానే వుంది. తెలుగువారి ఆరాధ్య సినీ నటుడు నందమూరి తారకరామారావు. సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు స్వర్గీయ ఎన్టీఆర్. అంతే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న డిమాండ్ సబబే. అదే సమయంలో, అంతకన్నా ముందు స్వర్గీయ ఎన్టీఆర్ పేరుని కూడా భారతరత్నకు సిఫార్సు చేయాల్సి వుంది. కానీ, అది సాధ్యమేనా.? భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం చుట్టూ ఎన్నెన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అవార్డు కోసం పోటీదారులు పెరిగితే, ఒకరికి ఇచ్చి.. ఇంకొకరికి ఇవ్వకపోవడం ద్వారా ఆ పురస్కారం తాలూకు గౌరవం తగ్గుతుందేమోనన్న వాదన కూడా వినిపిస్తోంది.
అయితే ఎన్.టీ.యార్ కేవలం తెలుగువారికే ఆరాధ్య నటుడనీ, ఎస్పీబీ యావత్ దక్షిణభారతదేశానికీ ఆరాధ్య గాయకుడని వేరే చెప్పక్కర్లేదు. అయినా లతా మంగేష్కర్ కి, భూపెన్ హజారికాకి భారత రత్న ఇచ్చినప్పుడు ఎస్పీబీకి ఇవ్వడం ఆవశ్యకం అనేది నిర్వివాదాంశం. పైగా రాజకీయాలకి అతీతమైన ఎస్పీబీ కేవలం తెలుగుకే కాక తమిళ, కన్నడ భాషల్లో కూడా పలువురు కొత్త గాయకుల్ని పరిచయం చేసే కార్యక్రమాలు చేసి ఆయాభాషల ఔన్నత్యాన్ని, ఉచ్చారణని కూడా కొత్త తరం వారికి తెలిపి పలుభాషల సేవ చేసారు.