'భలే భలే మగాడివోయ్' చిత్రంతో నాని కెరీర్ టర్న్ అయిపోయింది. ఆ తర్వాత 'నేను లోకల్' వరకూ వరుస హిట్లతో దూకుడు కొనసాగించాడు నాని. నాని సినిమా అంటే ఇక చూసుకోనక్కర్లేదు హిట్టే అనేంతగా తీసుకెళ్లిపోయాడు. కానీ 'కృష్ణార్జున యుద్ధం' నాని స్పీడుకు బ్రేకులేసేసింది. ఆ తర్వాత వచ్చిన 'దేవదాస్' కూడా ఆశించిన రిజల్ట్ అందించలేదు. దాంతో నాని జాగ్రత్త పడిపోయాడు. అప్పటి వరకూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేసే నాని కాస్త స్లో అయ్యి, ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడు.
ప్రస్తుతం 'జెర్సీ' సినిమాలో నటిస్తున్న నాని, తర్వాత విక్రమ్ కుమార్‌తో 'గ్యాంగ్‌లీడర్' సినిమాని లైన్‌లో పెట్టి ఉంచాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జెర్సీ' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా రాణించాలని కలలు కనే అర్జున్ పాత్రలో నాని నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఏప్రిల్ 19న 'జెర్సీ'ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడిదాకా బాగానే ఉంది. 'జెర్సీ'తో నాని మంచి హిట్ కొట్టాల్సి ఉంది.
జెర్సీ హిట్ నానికి ఎంతో కీలకం. ఈ సినిమా విజయంపైనే తదుపరి సినిమా 'గ్యాంగ్‌లీడర్' భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 'జెర్సీ' ఇంపాక్ట్ 'గ్యాంగ్‌లీడర్'పై చాలా ఎక్కువగా ఉంటుందని నాని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'గ్యాంగ్‌లీడర్' టైటిల్‌పై ఇప్పటికే పలు వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. క్రికెటర్‌గా హిట్ కొట్టాలన్న రీల్ కలతో పాటు, 'జెర్సీ'తో అసలు సిసలు హిట్ కొట్టాలన్న రియల్ కలను కూడా నాని సాకారం చేసుకుంటాడో లేదో చూడాలిక.