ఈసారి ఎన్నికలలో సినిమా వాళ్ల హవా ఎక్కువగానే కనిపించనుంది. మరీ ముఖ్యంగా సినీ గ్లామర్ వైకాపాకి ప్లస్ కాబోతోంది. అలీ, ఫృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయసుధ వీళ్లంతా వైకాపానే. ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరి (పీవీపీ) కూడా ఇప్పుడు వైకాపాకే జై కొట్టారు. 'బ్రహ్మోత్సవం', 'సైజ్ జీరో', 'ఘాజీ' లాంటి చిత్రాల్ని అందించారు పీవీపీ. చాలాకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని ప్రయత్నిస్తున్నారు. ఓదశలో టీడీపీలో ఆయన చేరిక ఖాయమని వార్తలొచ్చాయి. కానీ వైపాకా వైపు మొగ్గు చూపారు.
విజయవాడ నుంచి ఆయన పార్లమెంట్‌కి పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి పీవీపీకి గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే పీవీపీకి బలమైన సామాజిక వర్గం అండదండలున్నాయి. వ్యాపార వేత్త కాబట్టి ఆర్థికంగానూ సమర్థుడే. ఈసారి విజయవాడ ఎంపీ స్థానానికి ఆయన గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి కొంతమంది నిర్మాతలు ఇది వరకు రాజకీయాల్లో చేరి డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది ఎంపీలుగానూ గెలిచారు. మరి పీవీపీ జాతకం ఎలా ఉంటుందో చూడాలి.