స్టార్ హీరోగా సినిమాల్లో సేఫ్ పొజీషన్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వివాదాలకు దూరంగా కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే అలాంటి ఎన్టీఆర్‌ని ఇప్పుడు రాజకీయాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ ఒకసారి రాజకీయ ఆలోచనలు చేశారు. ఆ టైంలోనే ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచార కర్తగా వ్యవహరించారు. కానీ గతంలో పరిస్థితులు వేరు. అప్పుడు టీడీపీకి ప్రచార కర్తగా వ్యవహరించిన ఎన్టీఆర్‌ని, విజయం వరించిన తర్వాత చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా, అవమానించారనే అభిప్రాయాలు ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్నాయి.
అంతేకాదు, ఎన్టీఆర్ సినిమా ఎప్పుడొచ్చినా, టీడీపీ ఫ్యాన్స్ ఆ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది కూడా. అయితే ఇప్పటికీ టీడీపీలో కొందరు పార్టీ తరపున ఎన్టీఆర్ పని చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఎలక్షన్స్ చేరువవుతున్న వేళ, టీడీపీలోని ఆ కొందరు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుకి ఇటీవల ఈ విషయమై తమ డిమాండ్‌ని వినిపించారట. అలాగే ఎన్టీఆర్‌ని కలిసి కూడా తమ ఆలోచనను తెలియచేశారట. అయితే ఎన్టీఆర్ మాత్రం సున్నితంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి వచ్చే సాహసం చేయలేననీ, ప్రస్తుతం పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టాననీ, ఇప్పట్లో రాజకీయాల పట్ల ఆశక్తి చూపే అవకాశం లేదనీ ఎన్టీఆర్ తన అభిమానులకు స్పష్టం చేశాడట. ఇవన్నీ 'అట' మాత్రమే అయితే నిజంగానే ఎన్టీఆర్‌కి రాజకీయాల్లోకి వచ్చే ఆశక్తి లేదా? అంటే ఏమో చెప్పలేం. 'గుర్రం ఎగరా వచ్చు'. పరిస్థితులు ఎట్నుంచి ఎటైనా మారొచ్చు. వాటికి తగ్గట్లుగా అభిప్రాయాలూ మారిపోవచ్చు. ఏం చెప్పగలం..అదీ సంగతి.