తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల చాటిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమాని ప్యాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించేందుకు సాహసాలు జరుగుతున్నాయంటే, అందుకు బీజం వేసింది, దారి చూపింది ఖచ్చితంగా రాజమౌళినే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా రూపు రేఖలు మారిపోయేలా చేయడంలో ఆయన ధీరుడిగా నిలిచాడు. 'బాహుబలి' చూపిన బాటలోనే నేడు 'సైరా' వంటి ఎన్నో ప్యాన్ ఇండియన్ సినిమాలు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నాయి.
అలా తెలుగు సినిమాకి ఆదర్శంగా నిలిచాడు కాబట్టే, ఆయన్ని జక్కన్న, దర్శక ధీరుడు అని ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఈ రోజు మన దర్శక ధీరుడి పుట్టినరోజు కావడంతో, సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఓ మామూలు లవ్ సీనే కావచ్చు, ఓ మామూలు యాక్షన్ సీనే కావచ్చు.. అది అంతకు ముందు చాలా సినిమాల్లో చూసిందే కావచ్చు. కానీ, జక్కన్న చేతిలో పడితే, ఆయన దృష్టి పెడితే, ఆ సీను తీరు తెన్నులే మారిపోతాయి. రాజమౌళి వ్యూ అది. ఆ వ్యూలోనే రాజమౌళి గొప్పదనం దాగుంది. ఆయన మార్క్‌ని టచ్ చేయడం ఎవ్వరి తరమూ కాలేకపోయింది అలా తన దృష్టితో చూసే, 'ఈగ'ని హీరోగా పెట్టి తీసిన సినిమాతో సంచలనం సృష్టించాడు.
సినిమాని తనదైన వ్యూలో తెరకెక్కించడమే కాదు, ఆ సినిమాని ఎలా మార్కెట్ చేయాలో కూడా రాజమౌళికి తెలిసినట్లు మరెవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదేమో. అందుకే దర్శకులందు రాజమౌళి దర్శకత్వం వేరయా.. అనక తప్పదు. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాతో రాజమౌళి వచ్చే ఏడాది ఎలాంటి ప్రభంజనాలు సృష్టించనున్నాడో చూడాలిక. ఈ సందర్భంగా ఆయన మరిన్ని మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటూ, మనం కూడా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టు యూ రాజమౌళి గారు.