వరల్డ్ ఫేమస్ లవర్‌తో ఓ భారీ ఫ్లాపు మూటగట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అంతకు ముందు డియర్ కామ్రేడ్ కూడా పల్టీ కొట్టడం, వరల్డ్ ఫేమస్ లవర్ ఆకట్టుకోకపోవడంతో.. విజయ్ స్పీడు తగ్గినట్టైంది. నిజానికి వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాపు విజయ్ ఖాతాలో పడాల్సింది కాదు. అంతకు ముందు ఓ ఇద్దరు హీరోల దగ్గరకు ఈ కథ వెళ్లొచ్చింది. వాళ్లు `నో` చెప్పడంతో ఆ సినిమాని విజయ్ చేయాల్సి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడైన క్రాంతి మాధవ్ `వరల్డ్ ఫేమస్ లవర్` కథని ఇది వరకు శర్వానంద్ కి వినిపించాడట. `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` వీళ్ల కాంబోలోనే వచ్చింది. ఆ తరవాత వినిపించిన కథ ఇది. కానీ శర్వా నో చెప్పాడు.
ఆ కథ సాయిధరమ్ తేజ్ దగ్గరకీ వెళ్లింది. కానీ తను కూడా ఆసక్తి చూపించలేదు. ఎప్పుడో.. పెళ్లి చూపులు సమయంలో కె.ఎస్రామారావుతో సినిమా చేస్తానని మాటిచ్చాడు విజయ్. అడ్వాన్సు కూడా తీసుకున్నాడు. అప్పుడు చేసుకున్న ఎగ్రిమెంట్కి లోబడి.. ఇప్పుడు సినిమా చేసిచ్చాడు. నిజానికి ఈ సినిమా చేయడం విజయ్‌కి ఇష్టం లేదని, కానీ.. అడ్వాన్సు తీసుకున్నందుకు కమిట్ అవ్వాల్సివచ్చిందని గుసగుసలు వినిపించాయి. ఫ్లాపు రాసి పెట్టి ఉంటే, ఎవరు మాత్రం ఆపగలరు??