'కరెంటుంటే నీరుండదు, నీరుంటే కరెంటుండదు, ఆ రెండూ ఉండి పంట చేతికొస్తే, సరైన ధర ఉండదు.. అంటూ ఓ రైతు తన కష్టాల్ని చెబుతున్న డైలాగ్‌తో 'యాత్ర' టీజర్ స్టార్ట్ అయ్యింది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజన్న పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. టీజర్‌లో రైతు ఆత్మహత్యలు, కష్ట నష్టాల్ని హృద్యంగా చూపించారు. రైతుల్ని రాజుల్లా కాదు, కనీసం రైతుల్లా బతకనివ్వండి..
అనే డైలాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆసుపత్రిలో 'నేను విన్నాను.. నేనున్నాను..' అని రైతుకి భరోసాగా రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మమ్ముట్టి చెబుతున్న డైలాగ్ మరో హైలైట్‌గా నిలిచింది. రైతుల కోసం రాజన్న చేసిన పాదయాత్రను మెయిన్ కాన్సెప్ట్‌గా తీసుకుని మహి. వి. రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాదయాత్ర ఎపిసోడ్స్‌ని చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. ఇంతవరకూ విడుదలైన పోస్టర్స్, లేటెస్ట్ టీజర్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
మాజీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డికి చాలా మంది అభిమానులున్నారు. అభిమానులంతా ఈ బయోపిక్ కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని విజయ్ చల్లా, శశిదేవ్ రెడ్డి నిర్మించారు. అనసూయ, వినోద్‌కుమార్, పోసాని కృష్ణమురళి, రావురమేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.