రాంగోపాల్ వర్మ... ఈ దిగ్గజ దర్శకుడు... హిట్ కొట్టి చాలా చాలా చాలా కాలమైంది. అసలు వర్మ నుంచి సినిమా వస్తోందంటే, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆయన మేకింగ్ కూడా ఇప్పుడు టీవీ సీరియల్స్ కంటే అధ్వానంగా తయారైంది. ఆఖరికి కంట్రవర్సీల్ని నమ్ముకొన్నా వర్కవుట్ కావడం లేదు. అలాంటి వర్మని వైకాపా నాయకులు, నాయకత్వం నమ్మింది.
వర్మతో వరుసగా మూడు సినిమాలు చేయడానికి ప్రతిపాదనలు పైప్ లైన్‌లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ.. వచ్చే ఎన్నికల్లో వైకాపా తన ప్రధాన అస్త్రాలుగా వాడబోతోందని వినికిడి. ఓ సినిమా పవన్‌పై, మరోటి చంద్రబాబుపై తీసి, ఓ సినిమాని మాత్రం జగన్‌ని సపోర్ట్ గా తీయాలన్నది ఆలోచన. జగన్ సినిమాకి `జగన్నాథ రథ చక్రాలు` అనే పేరు కూడా పెట్టేశార్ట. ఈసినిమాలకు ఓ వైకాపా నేత నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని టాక్. ఓ సినిమా.. డిసెంబరులో మొదలు కానుందట. అందుకు సంబంధించిన స్క్రిప్టు వర్కు విషయంలో రాంగోపాల్ వర్మ తలమునకలై ఉన్నాడని టాక్. వైకాపా నాయకత్వం కోరుకొంటే.. `యాత్ర`లాంటి డీసెంట్ సినిమాల్ని తీసి, ప్రచారం చేసుకోవొచ్చు. అంతేగానీ, ఫ్లాపుల్లో ఉన్న వర్మని నమ్మకోవడం ఏమిటన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
వర్మని నమ్మితే.. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సినిమాల వల్ల వైకాపాకి ఎంత లాభమో తెలీదు గానీ, వర్మ మాత్రం కొంత సొమ్ముని వెనకేసుకోవడం ఖాయం.