'రంగస్థలం' పాట సంచలనాలు మొదలయ్యాయి. ఫస్ట్ సింగిల్ నిన్న సాయంత్రం విడుదలైతే, ఈ రోజు ఉదయానికే కేవలం యూ ట్యూబ్ వ్యూస్ 2 మిలియన్లు దాటేశాయి. తన ప్రేయసి రామలక్ష్మిని చిట్టిబాబు ‘ఎంత సక్కగున్నవే’ అంటూ వర్ణిస్తోంటే, ఆ వర్ణన సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉంటుందా? లిరిక్స్ అయితే సంచలనాలకే కేంద్ర బిందువుగా మారుతున్నాయి. అసలే, నేడు వాలెంటైన్స్ డే.. ఈ ప్రేమికుల దినోత్సవాన.. ప్రేమకు ట్రెడిషనల్ టచ్ ఇచ్చిన చిట్టిబాబు, లవర్స్ మనసుల్ని కొల్లగొట్టేశాడనడం నిస్సందేహం.
‘రంగస్థలం‘ సినిమానే ఓ ప్రయోగం. సుకుమార్ - చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అనూహ్యమైన కొత్త ప్రయోగం ఈ 'రంగస్థలం' సినిమా. ఓ లోపంతో హీరో. పల్లెటూరి కుర్రోడు. ఓ పల్లెటూరి అమ్మాయి. వీరిద్దరి మధ్యా లవ్. అచ్చమైన పల్లెటూరి అందాలతో, తన ప్రేమికురాలిని వర్ణించే తీరును ఈ పాటలో వినిపించారు. లవర్స్‌డే సందర్భంగా 'రంగస్థలం'లోని ఈ పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో, చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా తొలి ఆడియో సింగిల్‌గా ఈ పాటని విడుదల చేసి చిత్ర యూనిట్ మార్కులు కొట్టేసింది. 'ఎంత సక్కగున్నావే..' అంటూ హీరో, హీరోయిన్ అందాన్ని ప్రకృతితో పోలుస్తూ వర్ణిస్తున్న తీరు అద్భుతహ అనిపిస్తోంది.
సుకుమార్‌కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అందుకే ఆయన సినిమాల్లోని పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. అయితే వాటిన్నింట్లోనూ 'రంగస్థలం' వెరీ వెరీ ప్రెస్టీజియస్ మూవీ సుక్కుకి. సో ఈ సినిమా మ్యూజిక్ పట్ల మరింత శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది ఈ సాంగ్ వింటుంటే. పాత తరం పాట అయినా మ్యూజిక్‌లో ఎక్కడా క్వాలిటీ మిస్ కాకుండా, అలా అని అప్పటి నేటివిటీ ట్రెండ్ కూడా మిస్ కాకుండా, దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ వినసొంపుగా అనిపిస్తోంది. తొలి సారిగా సమంత - చరణ్ జత కడుతున్న చిత్రమిది.
రామలక్ష్మిగా సమంత, చిట్టిబాబుగా చరణ్ ఎంత సక్కగున్నారో మాటల్లో చెప్పేందుకు అస్సలు వీలు లేదు సుమీ. అందుకే సినిమాలోనే చూడాలి. చూడాలంటే మార్చి 30 వరకూ ఎదురు చూడాలి. అప్పుడేగా మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది..