ఇప్పటి మన స్టార్ హీరోలు ఎంత స్పీడ్ పెంచినా ఏడాది ఒక్క సినిమాకి మాత్రామే పరిమితం అయిపోతున్నారు. నిజానికి ఫలానా స్టార్ హీరో నుండి ఖచ్చితంగా ఏడాదికి ఒక సినిమా వస్తుందని కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా జయాపజయాలకు అతీతంగా సంవత్సరానికి ఏడు ఎనిమిది సినిమాలు చేసేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఓ సంవత్సరానికి ఏకంగా పదిహేను సినిమాలకు పైగానే చేశారట. ఒక్క కృష్ణనే కాదు అప్పటి హీరోలందరూ రోజుకి మూడు నుంచీ నాలుగు కాల్షీట్లు ఇచ్చేవాళ్లు.
కానీ ఇప్పటి స్టార్స్ గ్యాప్ లేకుండా రోజుకి ఒక్క కాల్షీట్ కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే పెద్ద హీరోలు ఎక్కువ చిత్రాలు చెయ్యడం వల్ల మూస ధోరణికి బ్రేక్ వేస్తూ.. స్టార్లు అనే రొటీన్ ఇమేజ్ చిత్రాల మధ్య నలిగిపోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకోవచ్చు. సినిమా సినిమాకి ఫ్యాన్స్ ను పెంచుకోవచ్చు. ఎన్టీఆర్ ఇలానే చేశారు. 'పాతాళ భైరవి' లాంటి ఆల్ టైం మాస్ ఫిల్మ్ చేసాక కూడా.. 'పిచ్చి పుల్లయ్య' 'కలసి ఉంటే కలదు సుఖం' లాంటి అచ్చమైన కుటుంబ కథా చిత్రాలతో వెండి తెర పై తెలుగు కమ్మదనాన్ని అద్దారు.
ఎన్టీఆర్ తో పాటూ ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర స్టార్లంతా ఎక్కువ చిత్రాలు చెయ్యడం వల్లే విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన సినిమాల్లో నటించి తమకంటూ ఒక బాణీని ఏర్పర్చుకున్నారు. అందుకేనేమో అప్పటి హీరోల్లో ప్రతి ఒక్కరికి తమకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. మరి ఇప్పటి హీరోల్లో ఆ శైలి ఉందా..? వాస్తవం మాట్లాడుకుంటే సగంమందిది ఒకటే శైలి కదా ! కారణం.. పదేళ్ల కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చెయ్యలేకపోవడం. అదే ఎక్కువ సినిమాలు చేస్తే.. నటనలోనూ మెరుగవుతారు. తమకంటూ ఓ శైలని క్రియేట్ చేసుకుంటారు.