నగరి నుంచి రెండోసారి గెలిచి, ఎం.ఎల్.ఏ గా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతోంది రోజా. ఈసారి రోజాకు మంత్రిపదవి ఖాయమని భారీగా ఊహాగానాలు వినిపించాయి. కనీసం ఆమెకు స్పీకర్ పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ... రాజకీయాలు, కుల సమీకరణాల దృష్ట్యా రోజాకు మంత్రి పదవి చేజారింది. దాంతో.. రోజా, ఆమె అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ రోజా పైకి మాత్రం ఆ అసంతృప్తి కనపడనివ్వలేదు. జగన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారన్న ధీమాతోనే ఉంది. అదే నిజమైంది. ఇప్పుడు రోజాకు ఊహించని పదవి దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా రోజా ని నియమించారు. ఇది నామినేటేడ్ పోస్ట్. కాకపోతే.. ఈ పదవికి డిమాండ్ ఎక్కువ. పరిశ్రమలకు భూమలు కేటాయించడం, వాటికి మౌళిక వసతుల్ని కల్పించడం ఈ కార్పొరేషన్ బాధ్యత. నిధులూ గట్టిగానే ఉంటాయి. ఇదే కాదు... రెండున్నర ఏళ్ల తరవాత రోజాకి మంత్రి పదవి ఇవ్వడం గ్యారెంటీ అని, జగన్ ఈ మేరకు రోజాకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఏదైతే ఏం..? రోజా కి కూడా ఓ పదవి వచ్చేసింది. ఇక మంత్రి కావడమే తరువాయి.