మెగాస్టార్ చిరంజీవి నుంచి అందింది కాబట్టి దాన్ని మెగా సైకిల్ అనాలి. అందుకున్నదెవరంటే, యంగ్ హీరో నాని. నేచురల్ స్టార్ నాని, చిరంజీవికి వీరాభిమాని. చిన్నప్పుడు 'మాస్టర్' సినిమా చూసేందుకు కొత్త సైకిల్‌తో వెళ్ళి, సినిమా టిక్కెట్ దొరికిన ఆనందంలో సైకిల్ని మర్చిపోయాడు. అలా ఆ సైకిల్ పోయింది. ఆ విషయాన్ని 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోలో నాని, చిరంజీవితో చెప్పడమే కాకుండా, అలాంటి సైకిల్ తనకు ఇప్పించాల్సిందిగా కోరాడు. నాని కోరిక మేరకు చిరంజీవి, ఓ మంచి సైకిల్ని కొనుగోలు చేసి, నానికి అందించారు. ఆ సైకిల్ని చూసి నాని మురిసిపోతూ, సైకిల్‌తో ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో తన 'మెగా' ఆనందాన్ని పంచుకున్నాడు. 'ఆ బాలుడు సైకిల్‌ను తిరిగి దక్కించుకున్నాడు. షోలో ప్రామిస్ చేసిన మేరకు చిరంజీవిగారు ఈ కూల్ సైకిల్ని పంపారు' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు నాని. ఈ సైకిల్ కోసం నాని ఎన్నో ప్రయత్నాలు చేశాడట. నిర్మాత అల్లు అరవింద్‌కి కూడా సైకిల్ గురించి చెప్పాడట. అది 'భలే భలే మగాడివోయ్' సినిమా సందర్భం. సరే, చూద్దాం అని చెప్పిన అల్లు అరవింద్, ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. ఎంతైనా మెగాస్టార్ కోసం పోగొట్టుకున్న సైకిల్ కదా, ఆ తీపి గురుతుని ఆయన ద్వారానే పొందాలని నాని చేసిన ప్రయత్నం సఫలమయ్యింది.