'స్నేహమేరా జీవితం' మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: శివ బాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మా, సత్య తదితరులు..
నిర్మాణ సంస్థ: గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్
సంగీతం: సునీల్ కశ్యప్
మాటలు: కిట్టు విస్సాప్రగడ
నిర్మాత: శివ బాలాజీ మనోహరన్
రచన - దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ గెలుచుకుని తన ఇంటిపేరు పక్కన బిగ్ బాస్ పెట్టేసుకున్న శివ బాలాజీ మొదటిసారి నిర్మాత గా మారి నిర్మించిన చిత్రం - స్నేహమేరా జీవితం. బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ఈ హీరో మరి తన సొంత చిత్రంతో ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

అనాధ అయిన మోహన్ (శివ బాలాజీ)ని చిన్నపట్టినుండి చేరదీసి తన సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు చలపతి (రాజీవ్ కనకాల). తాను ఉంటున్న ఊరికి ఎలాగైనా సరే MLA అవ్వాలి అన్నది చలపతి బలమైన కోరిక. ఇక అదే సమయంలో ఇందిర (సుష్మా)ని మోహన్ ఇష్టపడతాడు, కాని దైర్యంగా ఆ మాట తనకి చెప్పలేడు.

ఇక ఇది తెలుసుకున్న చలపతి తన స్నేహితుడైన మోహన్ కి ఈ విషయంలో సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. అయితే కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడంతో చలపతిపైన మోహన్ ద్వేషం పెంచుకుంటాడు. అతని రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ప్రాణ స్నేహితుడిని దెబ్బతీయాలని మోహన్ ఎందుకు అనుకుంటాడు? అసలు వీరి మధ్య ఏం జరిగింది? మోహన్ తన పంథాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది తెరపైన చూడాలి.

నటీనటుల ప్రతిభ:

శివ బాలాజీ: ఈ చిత్రంలో మోహన్ అనే పాత్రకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశాడు. అంతేకాకుండా ఈ కథ 80లలో జరుగేది కాబట్టి ఆ కాలమానానికి తగట్టు నటించే ప్రయత్నం చేశాడు.

రాజీవ్ కనకాల: ఈయనకి ఒక ప్రత్యేక నటుడు అనే ట్యాగ్ ఎందుకు ఇచ్చారో అనేది ఈ చిత్రం ద్వారా మనకి అర్ధమవుతుంది. ఈ చిత్రంలో ఆయన పలికిన సంభాషణలు, పలికించిన అభినయం రెండూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. మొరటుగా కనిపించే పాత్రలో జీవించాడు రాజీవ్.

సుష్మా: తన పాత్రకి తగ్గట్టుగా నటించింది. ఈ పాత్ర నిడివి కాస్త తక్కువ అని చెప్పాలి.

సత్య: కమెడియన్ సత్యకి ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది అనే చెప్పాలి. ఇక సత్య కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

విశ్లేషణ:

ఈ కథ 80వ దశకంలో సాగే కథ అవ్వడంతో దర్శకుడు మహేష్ అప్పటి పరిస్థితులు మనకి తెరపైన చూపించే ప్రయత్నం చేశాడు.

ఇక అదే విధంగా అప్పటి రాజకీయ సంఘటనలని కూడా కథలో భాగంగానే ప్రేక్షకులకి చూపించాడు. ఇక ఈ చిత్రం ప్రథమ భాగంలో మోహన్ - చలపతిల స్నేహం అలాగే మోహన్ - ఇందిరల ప్రేమ సన్నివేశాలని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.

ఇక ఇంటర్వెల్ సమయానికి ప్రేక్షకులకి ఇచ్చే ట్విస్ట్ ఆ తరువాత ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాల్లో అంతటి పట్టు మనకి కనిపించదు. దీనికి కారణం సినిమాలో ఇద్దరి స్నేహితుల మధ్య వచ్చే భేదాభిప్రాయాన్ని బలంగా చూపించకపోవడం సెకండ్ హాఫ్ పైన ప్రభావం చూపెడుతుంది.

అయితే ఈ చిత్రానికి నటుడిగానే కాకుండా నిర్మాతగా పనిచేసిన శివ బాలాజీ ప్రొడక్షన్ విషయంలో బాగానే శ్రద్ధ పెట్టినట్టు మనకి అర్ధమవుతుంది. 80ల నాటి పరిస్థితులని తెరపై చూపడంలో ప్రొడక్షన్ టీం సక్సెస్ అయింది అనే చెప్పాలి.

మాటల రచయత కిట్టు విస్సాప్రగడ అందించిన సంభాషణలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

శివ బాలాజీ
రాజీవ్ కనకాల
సంభాషణలు

మైనస్ పాయింట్స్:

సంగీతం
కథలో కొత్తదనం లేకపోవడం

ఆఖరి మాట:

స్నేహమేరా జీవితం - పర్లేదు ఒకసారి చూడొచ్చు...

రివ్యూ బై సందీప్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS