'గృహం' తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: సిద్ధార్థ్, ఆండ్రియా, అతుల్, అనిషా తదితరులు.
నిర్మాణ సంస్థ: వయాకం 18 మోషన్ పిక్చర్స్ & Etaki ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: గిరీష్
ఛాయాగ్రహణం: శ్రీయాస్ కృష్ణ
ఎడిటర్: లారెన్స్ కిషోర్
నిర్మాత: సిద్ధార్థ్
దర్శకత్వం: మిళింద్

యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5 

సిద్దార్థ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చేది 'బొమ్మ‌రిల్లు'. యువ‌త‌రం మెచ్చే ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించాడు. కొన్ని ప్ర‌యోగాలూ చేశాడు.  ప్రామిసింగ్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకొన్నాడు. అయితే.. క్ర‌మంగా సిద్దార్థ్ కెరీర్ తిరోగ‌మ‌న దిశ‌లో న‌డ‌వ‌డం ప్రారంభ‌మైంది. 'ల‌వ్ ఫెయిల్యూర్‌' త‌ర‌వాత ఒక్క‌టంటే ఒక్క హిట్టూ చూళ్లేదు. దాదాపుగా సిద్దూని మ‌ర్చిపోతున్న త‌రుణంలో 'గృహం' అనే సినిమా తీశాడు. దీనికి నిర్మాత కూడా త‌నే. తొలిసారి హార‌ర్ జోన‌ర్ క‌థ‌ని ఎంచుకోవ‌డం, దానికి సిద్దూనే నిర్మాత‌గా మార‌డంతో 'గృహం'పై ఆసక్తి మొద‌లైంది. దానికి త‌గ్గ‌ట్టు త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకొంది ఈ చిత్రం. మ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలు ఇందులో ఏమున్నాయి??   సిద్దూ క‌మ్ బ్యాక్ ఫిల్మ్‌గా 'గృహం'ని చూపించొచ్చా??

 * క‌థ‌
 
క్రిష్ (సిద్దార్థ్‌) ఓ డాక్ట‌ర్‌.  మెద‌డుకు సంబంధించిన సున్నిత‌మైన శ‌స్త్ర చికిత్స‌లు చేయ‌డంలో ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్‌. త‌న భార్య ల‌క్ష్మి (ఆండ్రియా). ఇద్ద‌రిదీ చాలా అన్యోన్య దాంప‌త్యం. త‌మ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఓ కుటుంబం కాపురానికి వ‌స్తుంది. వాళ్లు క్రిష్‌తో బాగా క‌లిసిపోతారు. రెండు కుటుంబాలూ పార్టీలు కూడా ఇచ్చిపుచ్చుకొంటాయి.  ఎదురింట్లోని జెన్ని (అనిషా విక్ట‌ర్‌) ఓ అల్ల‌రి పిల్ల‌. క్రిష్‌ని ఏడిపిస్తుంటుంది.  ఆమె చలాకీద‌నం చూసి క్రిష్ కూడా ముచ్చ‌ట‌ప‌డ‌తాడు. అయితే అనూహ్యంగా జెన్నీలో మార్పులు వ‌స్తాయి. ఒక‌ట్రెండుసార్లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కూడా చేస్తుంది. ఉన్న‌ట్టుండి చైనీస్ మాట్లాడుతుంటుంది. తీరా తేలిందేంటంటే.. ఆ ఇంట్లో లీజింగ్ అనే ఓ ఆత్మ తిరుగుతోంది. త‌నే జెన్నీని ఆవ‌హించింది. లీజింగ్ కాకుండా ఆ ఇంట్లో మ‌రో రెండు ఆత్మ‌లు కూడా ఉన్నాయి. అవి ఎవ‌రిని ఆవ‌హించాయి??  ఆ ఇంట్లో ఏం జ‌రుగుతోంది??  అనేదే మిగిలిన క‌థ‌. 
 
* న‌టీన‌టుల ప్ర‌తిభ‌
 
సిద్దార్థ్ ని ఈ త‌ర‌హా పాత్ర‌లో చూడ‌డం కొత్త‌. లుక్ ప‌రంగా సిద్దార్థ్ కాస్త నిరాశ ప‌రిచినా, న‌ట‌నతో షాక్ ఇచ్చేశాడు. ద్వితీయార్థంలో సిద్దార్థ్ హ‌వా మొద‌ల‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ త‌న‌ది అతిథి పాత్రే. ఈ సినిమాలో సిద్దార్థ్ ఏమీ లేదా అనుకొంటున్న త‌రుణంలో ఆ పాత్ర అనుకోని ప్ర‌వ‌ర్త‌న  క‌చ్చితంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.
 
ఆండ్రియా ఓకే అనిపిస్తే.... జెన్నీ పాత్ర‌లో క‌నిపించిన అనిషా ఆసాంతం ఆక‌ట్టుకొంటుంది. దెయ్యం ఆవ‌హించిన సంద‌ర్భంలో జెన్నీ న‌ట‌న బాగుంది.
 
మిగిలిన వాళ్లంతా సిద్ఢ‌హ‌స్తులైన న‌టీన‌టులే. వాళ్లంద‌రికీ పూర్తి మార్కులు ప‌డ‌తాయి.
 

* విశ్లేష‌ణ‌
 
ఈమ‌ధ్య హార‌ర్ సినిమాల హ‌వా మ‌రీ ఎక్కువైంది. కాక‌పోతే.. హార‌ర్ ప్లేసులో కామెడీ జోడిస్తున్నారు. న‌వ్విస్తూ భ‌య‌పెట్టాల‌ని చూస్తే, దెయ్యం సినిమాలు కూడా కామెడీగానే త‌యార‌వుతున్నాయి. చివ‌రికి దెయ్యాన్ని చూసి న‌వ్వుకోవాల్సివ‌స్తుంది. అందుకే హార‌ర్ సినిమాల ప‌ట్టు త‌ప్పిన‌ట్టు అనిపించింది. అయితే ఈమ‌ధ్య కాలంలో ప‌క్కాగా భ‌య‌పెట్ట‌డానికే తీసిన సినిమా ఇది. క‌థ‌లోకి వెళ్ల‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొన్నా, బీజింగ్ ఆత్మ ప్ర‌వేశించాక భ‌యం మొద‌ల‌వుతుంది. జెన్నీ ఎందుక‌లా ప్ర‌వ‌ర్తిస్తుంద‌నే విష‌యంలో కుతూహ‌లం క‌లిగించాడు ద‌ర్శ‌కుడు. అదో మాన‌సిక వ్యాధేమో అనుకొనేలా చేసి, చివ‌రికి ఆ ఇంట్లో దెయ్యం ఉంద‌ని తేల్చేశాడు. విశ్రాంతి ఘ‌ట్టం అల‌రిస్తుంది, భ‌య‌పెడుతుంది కూడా. 
 
దెయ్యాన్ని త‌రిమితే సినిమా అయిపోతుంది. కాబ‌ట్టి.. రొటీన్ సినిమానే అనుకొంటాం. కానీ... ఓ అనుకోని ట్విస్ట్‌తో ఉక్కిరి బిక్కిరి చేశాడు ద‌ర్శ‌కుడు. అదే... గృహం సినిమాకి అతి పెద్ద ప్ల‌స్ పాయింట్ అయ్యింది. సౌండింగ్స్ కొత్త‌గా ఉన్నాయి. స‌డ‌న్‌గా ఓ రూపం వ‌చ్చి మాయ‌మ‌వ్వ‌డం, అది భ‌య‌పెట్టేలా ఉండ‌డం పాత ప‌ద్ధతే అయినా, రీ రికార్డింగ్ బాగుండ‌డం, కొత్త న‌టీన‌టులు, కొత్త నేప‌థ్యంలో క‌థ సాగ‌డంతో ఆస‌క్తిని రేకెత్తించాయి. ప‌తాక స‌న్నివేశాలు కూడా బాగానే తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం అక్క‌డ‌క్క‌డ క‌నిపించినా, ద‌ర్శ‌కుడు త‌న మార్క్ చూపించ‌గ‌లిగాడు. ప్ర‌తీ పాత్ర‌కూ ఓ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌డం బాగుంది.
 
* సాంకేతిక వ‌ర్గం
 
 టెక్నిక‌ల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న సినిమా ఇది.  నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్‌, స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకొంటాయి. సాధార‌ణంగా హార‌ర్ సినిమాల్లో చురుకైన మాట‌లు చూసే అవ‌కాశం రాదు. కానీ... అక్క‌డ‌క్క‌డ సంభాష‌ణ‌లు కూడా మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు త‌న మార్క్‌ని చూపించాడు. పాత క‌థే అయినా ఓ కొత్త త‌ర‌హా హార‌ర్ అనుభ‌వాన్ని మిగిల్చాడు.
 
* ప్ల‌స్ పాయింట్స్‌
 
సిద్దార్థ్ న‌ట‌న‌
టెక్నిక‌ల్ వ‌ర్క్‌
ట్విస్ట్‌
 
* మైన‌స్ పాయింట్స్‌

రొటీన్ క‌థ‌
 
* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  సిద్దార్థ్ ఈజ్ బ్యాక్‌... 

రివ్యూ బై శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS